Sonam Wangchuk : కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి అంగ్మో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమాన్ని రాజకీయ నేతలు వాడుకోవడంపై ఆమె విమర్శలు వ్యక్తం చేశారు. సోమవారం సీజేపీ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి నేతలు ఢిల్లీలోని ప్రధాని నివాసం ఎదుట నిరసన చేపట్టారు.
ఈ అంశంపై వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి స్పందించారు. రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ఎదుట దీక్ష చేపట్టడం సరికాదన్నారు. మోదీ నివాసం వద్ద రాజకీయ నేతలు చేపట్టిన దీక్ష నిజాయితీలేనిదని, కృత్రిమమైనదని ఆమె విమర్శించారు. విద్యార్థులు చేపడుతున్న ఈ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు తమ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షలో పాల్గొనాలని కోరారు. అంతేకాని, ప్రత్యేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ చేపట్టిన దీక్షలో నిజాయితీ లేదన్నారు. వాంగ్‌చుక్, విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.
ప్రజల్ని ఎవరూ మోసం చేయలేరని, ఇండియా ఇప్పుడు మేల్కొందని ఆమె అభిప్రాయపడ్డారు. నిజాయితీలేని వారిని యువత తోసిపడేస్తారని గీతాంజలి అన్నారు. వాంగ్‌చుక్ ఉద్యమాన్ని, గుర్తింపును వాడుకోవాలి అనుకునేవారికి ప్రజల మద్దతు లభించబోదన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దీక్ష చేపట్టిన రెండు రోజులకు గీతాంజలి వారిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, కాంగ్రెస్ చేపట్టిన దీక్షకు కూడా జాతీయ స్థాయిలో మంచి స్పందన లభించింది.