న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరిన్ని రీచార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. టెలికం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త వినియోగదారుల రక్షణ నిబంధనలను ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు, డాటా అవసరం లేనివారికి వాయిస్ ఎస్ఎంఎస్ మాత్రమే అందించే ప్లాన్లకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికం కంపెనీలు 30 రోజులు, లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీతో వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే అందించే స్పెషల్ టారిఫ్ వోచర్లను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి నెలా అదే తేదీన రెన్యువల్ అయ్యే వోచర్‌ను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనేక నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్లకు 28 రోజుల వ్యాలిడిటీ ఉండటంపై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా గతంలో ప్రశ్నలు లేవనెత్తారు.28 రోజుల ప్లాన్ కారణంగా వినియోగదారులు ఏడాదికి 13 సార్లు రీచార్జ్ చేయాల్సి వస్తున్నదని ఆయన పేర్కొన్నారు.