Unseasonal Rains | రాయపోల్, మార్చి 23 : దౌల్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వడగలుల వర్షాలతో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలరాలడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్, సూరంపల్లి, దొమ్మాట, ముబారస్ పూర్ తదితర గ్రామాల్లో యాసంగిలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట అకాల వర్షానికి ఆవిరైపోయింది.
చేతి కందే సమయంలో..
ఎంతో కష్టపడి యాసంగి సాగులో వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా చేతి కందే సమయంలో కండ్ల ముందే అకాల వర్షానికి కిందపడిపోవడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని ఆయా గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓవైపు నీటి కొరత.. మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలు.. నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేసి పంటలు సాగు చేయగా కోతకు వచ్చే సమయంలో అకాల వర్షానికి నష్టం రావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాగా శనివారం మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్‌తోపాటు ఆయా గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో అకాల వర్షానికి నష్టపోయిన పంట వివరాలను సేకరించారు. సుమారు 175 ఎకరాల్లో పంట నేల వాలిందని ఏవో పేర్కొన్నారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పడాల రాములు, నాయకుడు బండారు లాలయ్య కోరారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు