కడెం : మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు (Kadem project) , చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీల) వద్ద ఉంది. అయితే ఇప్పటికే నీటిమట్టం (Water level ) తగ్గడంతో ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు చివరి వరకు నీరు అందుతుందా అనేది ప్రశ్నర్ధాకంగా మారింది.
ఎస్సారెస్పీ( SRSP ) నుంచి కొన్ని రోజుల పాటు సరస్వతి కాలువ ద్వారా నచ్చన్ఎల్లాపూర్ మీదుగా కడెం ప్రాజెక్టులోకి నీటిని నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సదర్మాట్ ( Sadarmat ) కింద చివరి ఆయకట్టు వరకు నీటి సరఫరా లేకపోవడంతో మద్దిపడగ, ఎలగడప, పెత్తార్పు, చిట్యాల, లక్ష్మీసాగర్, పెద్దూర్తాండ గ్రామాల్లోని పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో వారబంధి పద్ధతిన ఆ గ్రామాలకు నీటిని అందిస్తున్నారు. దీంతో కడెంకు ఫీడింగ్ నిలిచిపోయింది.
అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో లేని కారణంగా కడెం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న అధికారులు పంట చివరి వరకు నీటిని అందిస్తారా లేదా అనేది ప్రశ్నర్ధకంగా ఉందని రైతులు వాపోతున్నారు. వరి పొట్ట దశలో ఉన్నందున ఏప్రిల్ చివరి వారం వరకు నిరంతరాయంగా సాగునీటిని అందిస్తేనే పంటలు చేతికొస్తాయని, ఎస్సారెస్పీ నుంచి కడెంకు నీటి సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. కుడి కాలువకు నిరంతరాయంగా నీటిని కొనసాగించిన అధికారులు కాలువను మూసివేశారు.
దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు పది క్యూసెక్కుల నీటిని అందించే కుడి కాలువను మూసివేసి, ప్రధాన కాలువకు 467 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నారని, ఇలానే కొనసాగితే కుడి కాలువకు నీరు అందక కాలువ ఎత్తిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. గతంలో కుడి కాలువకు వారబంధి పద్ధతి అమలు చేయమని చెప్పిన అధికారులు ఇప్పుడు కాలువను మూసివేయడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.