హనుమకొండ చౌరస్తా, మార్చి 2: తెలంగాణ రాష్ర్టం నుంచి రాజ్యసభ సీటు మాదిగలకు కేటాయించాలని ఎమ్మెస్పీ జాతీయ నేత మందకుమార్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభ సీటును మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగల ఎమ్మెల్యే స్థానాలు తగ్గించి మాలలకు కేటాయించడం మాదిగ జాతికి తీరని అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు.
అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాలు ఉంటే ఒకటి కూడా మాదిగలకు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతిని మోసం చేసిందన్నారు. నామినేట్ పదవులల్లో మాదిగలకు అవకాశాలు రావాలని ముఖ్యమంత్రి ఇప్పటికైనా మాదిగ జాతికి తీరని అన్యాయం చేయకుండా రాజ్యసభ సీట్లు వెంటనే కేటాయించాలని లేని పక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటానికి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ జాతీయ నాయకులు వేల్పుల సూరన్న కాపు, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్రా బిక్షపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు జన్ను దినేష్ మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్ మాదిగ, రాష్ర్ట నాయకులు మంద రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ర్ట కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి సుంచు రజినికుమార్ మాదిగ పాల్గొన్నారు.