ఖైరతాబాద్, మార్చి 10 : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల కంట కన్నీరు ఆగడం లేదు. దశాబ్దాలుగా ఉంటున్న ఇండ్లను తమ కండ్ల ముందే నేలమట్టం చేసిన కాంగ్రెస్ సర్కార్ చర్యలను భరించలేకపోతున్నారు. ఊహకందని రీతిలో జరిగిన విధ్వంసంతో వందలాది మందిని రోడ్డున పడేసిన తీరుపై ప్రజాసంఘాలతో పాటు, మానవ హక్కుల సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాసంఘాలు, బీఆర్ఎస్ నాయకులు, న్యాయనిపుణులతో బాధితులు సమావేశమయ్యారు. న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని బీఆర్ఎస్ నేతలు వారికి హామీ ఇచ్చారు. ఇండ్లను కూల్చివేయడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారని, ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్ధమంటూ మండిపడ్డారు. రూ.250 కోట్ల విలువైన భూదాన్ భూములను కాజేయాలనే కుట్రతోనే తమ ఇండ్లు కూల్చారని ఆరోపించారు. భూదాన్ భూములు పేదలకు చెందాయని, విచారణ చేస్తే ఇక్కడ నివాసం ఉన్న వారందరూ పేదలేనని తేలుతుందని చెప్పారు. తమకు న్యాయం జరిగేదాకా పోరాడేందుకు సిద్ధమని వారు స్పష్టంచేశారు.
ఎంతో కష్టపడి కట్టుకున్నం
భూదాన్ భూముల్లో ఉన్న రాళ్లు, గుట్టలను తొలగించి ఎంతో కష్టపడి ఇండ్లు కట్టుకుంటే.. ప్రభుత్వం కనికరం లేకుండా కూలగొట్టింది.పిల్లల చదువులు ఆగిపోయాయి. తినేందుకు కూడా తంటాలు పడుతున్నం. పేదల కోసం వినోభాబావే భూదాన్ ఉద్యమం చేస్తే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తాంది.
– విజయలక్ష్మి, బాధితురాలు
మంతుల్రు కనీసం పరామర్శించరా?
మేం పదేండ్లుగా వెలుగుమట్లలో ఉంటున్నం. కనీస సౌకర్యాలు కూడా లేవు. పోలీసులతో బెదిరించి జేసీబీలతో ఇండ్లు కూలగొట్టి మా బతుకులను రోడ్డున పడేశారు. మేం గౌరవంగా ఉండాలని చూశాం. అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమే. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కనీసం పరామర్శించకపోవడం బాధాకరం. కలెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి.
– బాధితురాలు సలోని
కూల్చిన చోటే ఇండ్లు నిర్మించాలి
రాష్ట్రంలో బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తున్నది. 1954 నుంచి 1985 వరకు కూడా 62.7 గుంటల భూమి రెవెన్యూ రికార్డ్స్‌లో ఉన్నది. దాన్ని కబ్జా చేసేందుకు 1989లో కొందరు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కానీ 2013లో హైకోర్టు వాటిని రద్దు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం అందులో రెవెన్యూ జోక్యం ఉండొద్దు. కానీ అందుకు విరుద్ధంగా ఇండ్లను కూల్చివేశారు. కోర్టు ఆదేశాలను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఎందుకు పాటించలేదు. ఇప్పటికైనా పేదలపై దౌర్జన్యాలను ఆపాలి. కూల్చిన స్థానంలో కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
– నిరోష, వుబ్బలపల్లి, బీఆర్ఎస్ లీగల్ సెల్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు
హైకోర్టు ఆదేశించినా కూల్చేశారు
వెలుగుమట్లలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి పేదల నిర్మాణాలను కూల్చివేశారు. 2014లో భూదాన్ బోర్డు ద్వారా 1885 మందికి పట్టాలు జారీ చేశారు. కనీస సౌకర్యాలు కల్పించాలని బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే పేదలను ఖాళీ చేయించవద్దని ఆదేశాలిచ్చింది. 62.7 ఎకరాల భూదాన్ భూమిపై రెవెన్యూ శాఖకు అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసినా ప్రభుత్వం మాత్రం ఆదేశాలను పట్టించుకోలేదు.
– సుగుణారావు, తిరుమలరావు, న్యాయవాదులు
బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. దాదాపు 800ఇండ్లను కూల్చి వేలాది మందిని ప్రభుత్వం నిరాశ్రయులను చేసింది. బాధితులకు ఇండ్లు కట్టించేదాకా మా పోరాటం ఆగదు.
– పగడాల నాగరాజు,ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు