రుద్రంపూర్, ఆగస్టు 10 : 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేసి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ– ఐ ఎన్ యు సి–సి ఐ టి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా, ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూలై 1, 2026 నుండి 12వ వేతన కాల పరిమితి ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు వేతన కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యమని సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బొగ్గు పరిశ్రమను తమ శ్రమతో ముందుకు నడిపిస్తున్న కార్మికుల వేతనాల విషయంలో జాప్యం చేయడం అన్యాయమన్నారు. కార్మికుల వేతనాలు, అలవెన్సులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల శ్రమతో సంస్థలకు లాభాలు వస్తున్నప్పుడు వారి వేతనాల పెంపు విషయంలో కాలయాపన చేయడం సమర్థనీయం కాదన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏ సంఘానికీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను సాకుగా చూపిస్తూ 51 శాతం ఓట్లు రాని పరిస్థితిని చూపి వేతనాల పెంపు ప్రక్రియను వాయిదా వేయడం కార్మికుల హక్కులను హరించడమేనని నాయకులు పేర్కొన్నారు. కార్మిక సంఘాలను పక్కన పెట్టి వేతనాలు, హక్కులు, సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకొచ్చే విధానాలను ఐక్యంగా అడ్డుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రత, వేతనాలు, కార్మిక హక్కులు, సంక్షేమ ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలను సహించేది లేదన్నారు. కార్మికుల సహనాన్ని పరీక్షిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. కొత్తగూడెం ధర్నా–ముట్టడి కార్మిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని సంఘాల నాయకులు పేర్కొన్నారు.
వేతనాల పెంపు విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేసి చర్చల ప్రక్రియ ప్రారంభించే వరకు ఉద్యమం ఆగదని ఎఐటియుసి– ఐ ఎన్ యు సి–సి ఐ టి నాయకులు స్పష్టం చేశారు.అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులకు సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు గట్టయ్య, రమణమూర్తి, ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, క్రిస్టోఫర్, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ రజాక్, బి.రాజేశ్వరరావు, జె.రాజేశ్వరరావు, సకినాల సమ్మయ్య, అభిషేక్, కుమారస్వామి, సిఐటియు అధ్యక్షుడు మంద నర్సింహారావు, విజయగిరి శ్రీనివాస్, వై.వెంకటేశ్వర్లు, రాజబాబు, రమేష్ బాబు, పెద్దఎత్తున కార్మికులు పాల్గొన్నారు.