పరిస్థితులకు తగ్గట్టు మనమూ మారాలనేమాటను నిజం చేసింది ఈ పెద్దమ్మ. చదువు రాకపోయినా శ్రమను నమ్ముకుంది. ఆరుగాలం కష్టపడి పంట తీస్తే అది దళారుల దోపిడికి గురవుతున్నదని గ్రహించింది. తాను పండించిన పంటను నేరుగా వినియోగదారుడికే అందించాలని ఆలోచించింది. అందుకు సోషల్‌మీడియాను వేదిక చేసుకుంది ఈ మహిళా రైతు. చుట్టు పక్కలవాళ్లు ఎగతాళి చేసినా పట్టించుకోకుండా ముందుకుసాగి తన పంటను తానే అమ్ముకునే స్థాయికి చేరింది. సోషల్ మీడియాలో ‘పల్లెటూరి రైతు బిడ్డ’గా ఫేమస్ అయిన భాగ్యలక్ష్మి విజయగాథ ఇది. రైతు నుంచి ఆంత్రప్రెన్యూర్‌గా అవతారమెత్తిన ‘ఫార్మర్ ప్రొడక్ట్’ వ్యవస్థాపకురాలు భాగ్యలక్ష్మి జిందగీతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
ఇంట్లో చిన్నదాన్నే అయినా చిన్నప్పటినుంచే అన్ని పనులు నేర్చుకున్నా. మూడో తరగతి వరకు చదువుకొని ఆ తరువాత బడి మానేసిన. మా అమ్మతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేదాన్ని. చిట్టి చిట్టి చేతులతో అమ్మకు ఆసరా అయ్యేదాన్ని. అమ్మానాన్నలు కూడా తమకు వయసైపోతుందని భావించి ప్రస్తుత హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లికి చెందిన రాజయ్యకిచ్చి పదహారేళ్లకే నా పెళ్లి చేసిండ్రు. నా భర్త కూడా నాలాగే ఇంట్లో అందరికంటే చిన్నోడు. ఇప్పుడు ఇంట్లో చిన్నవాళ్లను ప్రేమతో చూసుకున్నట్లు ఆరోజుల్లో అలాంటివేమీ లేవు. పెళ్లి చేసి వాళ్ల బరువును దించుకునేవాళ్లు. మా అత్తమామ మాకు చిన్న గదితోపాటు ఎకరం పొలాన్ని మా వంతుకు ఇచ్చిండ్రు. ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తరువాత మాకిచ్చిన ఇంట్ల కొన్నిరోజులు ఉండగానే కుటుంబ కారణాల రీత్యా అందులోంచి బయటికొచ్చినం. ఆ ఊర్లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నం. ఆ అద్దె ఇంట్ల కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయినం. ఒకరోజు ఆ ఇంటి ఓనర్ వాళ్ల అమ్మ చనిపోయిందని అప్పటికప్పుడు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించిండ్రు.
నేను చదువుకోకున్నా కష్టంచేసి బతుకచ్చనే ఆలోచనగలదాన్ని. మా ఆయన కష్టజీవి, ఎప్పుడు చూసినా పొలం పనుల్లోనే మునిగిపోతుండేటోడు. అప్పటికే అన్నిపనులు నేర్చుకున్న నేను ఆయనకు తోడుగా నిలిచిన. మాకిచ్చిన ఎకరంతో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి, పల్లీ, మిరప సాగు చేసినం. వ్యవసాయం చేసుకుంటనే ఇంటి జాగ కొనుక్కొని చిన్నపాటి ఇల్లు కట్టుకున్నం. అంతమంచిగ ఉందన్న టైంలోనే మా ఇంటాయన బిల్డింగ్ మీది నుంచి కింద పడ్డడు. పక్షవాతంతో ఆరు నెలలు మంచానికే పరిమితమైండు. అయినా కూడా ధైర్యాన్ని సంపుకోలేదు. నా పిల్లలను ఒకవైపు చదివిస్తూనే, మరోవైపు ఆయన వైద్యంకోసం దవాఖాన్ల పొంటి తిరిగేదాన్ని. వ్యవసాయ పనులు కూడా నేనే చూసుకునేదాన్ని. కష్టం చేసుకుంటూ పైసా పైసా జమచేసి 2010 వరకు ఏడెకరాల సొంతభూమి కొన్నాను. మంచి ఇల్లు కూడా కట్టుకున్నం.
ఎంత పంట పండించినా దాన్ని అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఒక్కోసారి మార్కెట్‌కు తీసుకుపోయిన పంట అమ్మకముందే వానలో తడిసి ముద్దయ్యేది. చేతికందిన పంట నీళ్లపాలు అవ్వడం చూసి దుఃఖం ఆగేది కాదు. మరోవైపు మా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కొందరు దళారులు కారుచౌకగా పంటను కొనుక్కునేవారు. అవన్నీ చూసిన నాకు మన పంటను మనమే నేరుగా వినియోగదారుడికి ఎందుకు అమ్ముకోకూడదు అనిపించింది. కానీ, అదెలా చేయాలో అర్థం కాలేదు. బాగా ఆలోచించాను. అప్పటికే నా చిన్నకొడుకు యూట్యూబ్ చానెల్ పెట్టుకొని చిన్న చిన్న వీడియోలు చేస్తుండేవాడు. వాడికి నా ఆలోచన చెప్తే సోషల్ మీడియా గురించి చెప్పిండు. అలా రెండేళ్ల క్రితం ‘పల్లెటూరి రైతుబిడ్డ’గా మీ అందరి ముందుకొచ్చాను. పల్లీల గురించి తొలి వీడియో చేసి పోస్ట్ చేస్తే దాదాపు వెయ్యికి పైగా ఆర్డర్లు వచ్చాయి. ప్యాకింగ్ చేసే బాక్స్ లేకపోయినా అప్పటికైతే ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాక్స్‌ల్లో ప్యాక్ చేసి పంపించాం.
మా పొలంలో పండించే పల్లీలు, మిర్చితోపాటు ఇతర రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసుకొని వాటిని పొడిగా చేసి ‘ఫార్మర్ ప్రొడక్ట్’ బ్రాండ్ పేరుతో అమ్ముతున్నాను. ప్రారంభంలో చాలామంది ఆర్డర్లు పెట్టి మధ్యలో కొన్ని నెలలపాటు తగ్గించారు. అయినా కూడా నిరాశ చెందకుండా మా ఉత్పత్తులను కొనసాగించాను. అలా కొన్నిరోజులకు నెమ్మదిగా పెరిగాయి. ప్రస్తుతం రోజుకు 5 క్వింటాళ్ల కారంపొడి ఆర్డర్స్ వస్తున్నాయి. మిగతావి కూడా అటు ఇటుగా అదే స్థాయిలో వస్తున్నాయి. ప్రారంభంలో మిరపకాయలను బయట పట్టించేవాళ్లం. ఆ తరువాత రూ.లక్షతో ఒక మిషిన్ కొనుగోలు చేసుకుని నేనే కారంపొడి, పసుపు పొడి పడుతున్నాను. ఇంటినే చిన్నపాటి పరిశ్రమగా చేసుకొని నా చిన్నకొడుకుతో పాటు మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. వ్యవసాయ క్షేత్రంలో రైతులు పడే కష్టాలు, మేము పండించే పంటలను నేరుగా మా ఫాలోవర్స్‌కు చూపించడం వల్ల మాపై నమ్మకంతో ఆర్డర్లు పెడుతున్నారు. చానెల్ పెట్టిన కొత్తలో పదివేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండేవాళ్లు. ప్రస్తుతం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో 4లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నేను చేసే కంటెంట్‌కు నెలకు నాలుగు కోట్లకు పైగా వ్యూస్ వస్తుండటం విశేషం. ప్రస్తుతం నెలకు రూ.2 లక్షల టర్నోవర్‌లో ఖర్చులన్నీ పోను రూ.60వేలు మిగులుతున్నాయి.
సోషల్‌మీడియాలో నా వీడియోలు చూసి ‘మా అమ్మలాగే మాట్లాడుతున్నారు, మా పెద్దమ్మ మీలాగే ఉంటుంది’ అంటూ పెట్టే కామెంట్లను నా కొడుకు చదివి వినిపించినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. మా ఊరు తప్ప బయటి ప్రపంచం తెలియని నేను సోషల్‌మీడియా పుణ్యమా అని ఢిల్లీ, హైదరాబాద్‌లకు వెళ్లి కొన్ని కంపెనీల ట్రాక్టర్లు లాంచ్ చేశాను. ఇప్పటివరకు నా రెక్కల కష్టంతోనే పైకొచ్చిన! మా ‘ఫార్మర్ ప్రొడక్ట్’ ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
మొదట్లో వీడియోలు తీస్తుంటే చాలా మంది ఎక్కిరించిండ్రు.వ్యవసాయం చేసుకునే ఈమెకెందుకో వీడియోలు తీసుడు అని ఎగతాళిగా మాట్లాడిండ్రు. అయినా కూడా వాళ్ల మాటలను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ ముందుకు సాగాను. పిల్లలు చిన్నగున్నప్పుడు ఇంట్లో మా ఆయన గొడవచేస్తే నా గోడును బయటికి చెప్పుకోకుండా నాలుగు గోడలమధ్యనే ఆపుకొన్నా. పుట్టింటోళ్లకు కూడా చెప్పుకోలేదు.
– రాజు పిల్లనగోయిన