Bhudan Lands | ఖమ్మం, మార్చి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. న్యాయం జరిగే దాకా కొట్లాడుతామని, అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పడం, ఖమ్మం పర్యటనతో భూపోరాట ఉద్యమం ఉధృతం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎట్టకేలకు వెలుగుమట్లలో పేదల ఇండ్లను అక్రమంగా కూల్చివేసినట్టు రేవంత్ సర్కార్ తన తప్పును ఒప్పుకొని కూల్చిన చోటే ఇండ్లు కట్టించేందుకు అంగీకరించింది. మంగళవారం హడావుడిగా బాధితులను గుర్తించి బుధవారం 412 కుటుంబాలకు ఖమ్మం కలెక్టరేట్లో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో 311 కుటుంబాలకు భూదాన్ భూముల్లోనే ఇండ్లు ఇవ్వాలని, మిగతా 101 మందికి వారి స్వగ్రామాల్లో స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లుచేసింది.
బీఆర్ఎస్ పోరాటంతోనే తమకు న్యాయం జరిగిందంటూ బాధితుల్లో సంతోషం వెల్లివిరిసింది. రేవంత్‌రెడ్డి బుల్డోజర్ పరిపాలన రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా సంచలనమైంది. భూదాన్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను గత నెల 24న కాంగ్రెస్ ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లతో కూల్చడం, దాదాపు 450 కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బాధితులకు అండగా నిలిచారు. గత నెల 26న ఖమ్మం వెళ్లి బాధితులను కలిసి వారి బాధలు విన్నారు. కన్నీళ్లు తుడిచారు. ఇదే స్థలంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చి మళ్లీ ఇండ్లు కట్టించేవరకు బీఆర్ఎస్ పోరాడుతుందని, అప్పటివరకూ తమ పార్టీ నేతలు పేదలకు అండగా ఉంటారని ప్రతిజ్ఞ చేశారు. బాధితుల తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు.
వారికి అవసరమైన ఏర్పాట్లు చూసుకోవాలని, బాధితులను కంటికిరెప్పలా కాపాడుకోవాలని స్థానిక నేతలను ఆదేశించారు. ప్రభుత్వ దాష్టీకాన్ని, బాధితుల మీద పదే పదే జరుగుతున్న పోలీసు దాడులను కేటీఆర్ జాతీయ పౌర సమాజం దృష్టికి తీసుకు వస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు. బాధితులకు అండగా న్యాయపోరాటం కూడా చేస్తామని, అవసరమైతే పార్టీ ఖర్చులతో సుప్రీంకోర్టుకైనా వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్నట్లుగానే ఆ దిశగా న్యాయపోరాటమూ చేస్తున్నారు. త్వరలో శాసనసభ సమావేశాలు కూడ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వెలుగుమట్ల బాధితుల పక్షాన గళం విప్పాలని, అధికారపక్ష దుర్మార్గాన్ని ఎత్తి చూపాలని కేటీఆర్ శాసనసభ్యులకు దిశానిర్దేశం చేయడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
నిజానికి బాధితుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 22మంది తహసీల్దార్లతో ఇండ్లు కోల్పోయిన 750 కుటుంబాల్లో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియను చేపట్టింది. శాసనసభ సమావేశాలు సమీపిస్తున్న క్రమంలో కొంతమందికైనా ఇండ్ల పట్టాలు ఇస్తే బీఆర్ఎస్ నేతలను కొంతవరకు కట్టడి చేయవచ్చనే ఆలోచనతో సత్వరమే ఇండ్ల పట్టాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 412 బాధిత కుటుంబాలను గుర్తించింది. వారికి మంగళవారం సాయంత్రం టోకెన్లు అందజేశారు.
భూదాన్ నిర్వాసితులకు సుమారు 15 రోజుల పాటు బీఆర్ఎస్ అండదండగా ఉంటూ వచ్చింది. బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు బాధితులకు బాసటగా నిలిచారు. వారి కోసం ప్రత్యేక భోజన ఏర్పాట్లు, వైద్య సహాయం చేశారు. ఇండ్లు కూల్చివేతల నాటినుంచి మొదలైన ఈ సహాయం ఇప్పటికీ కొనసాగుతున్నది. భూ నిర్వాసితులను పరామర్శించి ఇండ్లు కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధును గత నెల 24న పోలీసులతో ప్రభుత్వం అరెస్టు చేయించింది.
ఆయన అరెస్టుకు నిరసనగా ఖమ్మం టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, ఆర్జేసీ కృష్ణ తదితరులు నిరసన తెలిపారు. అనంతరం ఖమ్మం కలెక్టర్‌ను కలిసి బాధితులకు భూదాన్ భూముల్లోనే స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించాలని కోరారు. 15 రోజుల బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం వల్ల తమకు భూదాన్ భూముల్లోనే తిరిగి ఇండ్లు దక్కాయని నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పక్షాన నిలిచిన బీఆర్ఎస్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.