అభివృద్ధికి చిరునామాగా చెప్పుకొనే కరీంనగర్ జిల్లా కేంద్రం అస్తవ్యస్తంగా తయారవుతున్నది. నగర పాలక సంస్థ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేమితో భారీ భవన యజమానులు, వ్యాపార సంస్థల ఇష్టారాజ్యం నడుస్తున్నది. అత్యాధునిక హంగులతో భవంతులు కడుతున్నా.. పార్కింగ్‌కు స్థలం వదలకపోవడం, నిర్మించిన సెల్లార్స్ను నిబంధనలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో పార్కింగ్ సమస్య జఠిలంగా మారుతున్నది. వాహనదారులు ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపుదల చేస్తుండగా, రోజురోజుకూ ట్రాఫిక్ జామ్ పెరుగుతున్నది. పర్యవేక్షించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం చూసీచూడనట్టు వ్యవహరిస్తూ, కేవలం నోటీసులతో సరిపుచ్చుతున్న తీరు విమర్శలకు తావిస్తున్నది.

కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 8: కరీంనగర్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవుతున్నది. భారీ బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాలకు సరైన పార్కింగ్ సదుపాయాలు కల్పించకపోవడంతో ఏ వ్యాపార కేంద్రానికి వెళ్లినా, హాస్పిటళ్ల వీధికి వెళ్లినా వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా టవర్‌సర్కిల్, డాక్టర్ స్ట్రీట్, కోర్టు రోడ్డు, మంచిర్యాల చౌరస్తా నుంచి కోర్టు వైపు, ప్రభుత్వ దవాఖాన వెనుకాల, మంకమ్మతోట, విద్యానగర్, కమాన్ నుంచి ప్రాంతాలు, ఎస్సారార్ కాలేజీ రోడ్డు, సీతారాంపూర్, గాంధీ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహనాలన్నింటినీ రోడ్లపైనే పార్క్ చేస్తుండడంతో ట్రాఫిక్ స్తంభిస్తున్నది. డాక్టర్ స్ట్రీట్ అయితే వాహనాలు, అంబులెన్స్‌లతో నిండిపోతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నది.
అలాగే కమాన్ నుంచి హైదరాబాద్ రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంటున్నది. వాస్తవానికి నగరంలో అనేక బహుళ అంతస్తుల నిర్మాణాల సమయంలో పార్కింగ్ పేరుతో సెల్లార్స్ నిర్మించినా, వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో వాహనాలు రోడ్లపైన నిలపాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కొన్ని బహుళ అంతస్తులు నిర్మించినా వాటికి పార్కింగ్ సదుపాయం లేక రోడ్లపైనే ఉంచాల్సిన దుస్థితి ఉన్నది. ఈ విషయంలో నగరపాలక సంస్థకు అనేక ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులు, పాలకవర్గం, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడో ఒకసారి సెల్లార్స్ తనిఖీల పేరుతో హడావిడి చేయడం, నోటీసులు ఇచ్చి ముడుపులు పుచ్చుకొని చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ యేడాది ఆరంభంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్స్ను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అందించారు. కానీ, ఇప్పటి వరకు మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. అయితే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం వల్లే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. రోడ్లపై వీధివ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకునే అధికారులు, పార్కింగ్ సౌకర్యం లేకుండా భవనాలు నిర్మిస్తున్న, సెల్లార్స్ను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
నగరంలో బహుళ అంతస్తుల నిర్మాణాల సమయంలోనే టౌన్ ప్లానింగ్ అధికారులు పార్కింగ్ సదుపాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, మెజార్టీ ప్రాంతాల్లో కనీసం పార్కింగ్ స్థలాలు వదలకుండానే వాణిజ్య, వ్యాపార భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. పైగా ముడుపులు తీసుకుంటూ ఓకే చెబుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కింగ్ స్థలాలు, సెల్లార్స్ను అక్రమంగా వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ భవనాలకు పార్కింగ్ స్థలాలు ఉండేలా చూడాలని, అప్పుడే కొంచమైనా ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.