Drinking Water | హత్నూర, ఏప్రిల్ 10 : అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయేసరికి గ్రామస్తులంతా రోడ్డెక్కి నిరసన బాట పట్టారు. గ్రామంలో కొన్ని రోజులుగా తీవ్రంగా తాగు నీటి ఎద్దడి నెలకొందని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపురం గ్రామస్తులు ఇవాళ రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. వేసవికాలం కావడంతో నీటి వాడకం ఎక్కువగా ఉండగా.. నల్లాల ద్వారా వచ్చే నీరు సరిపోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామంలో రెండు వాటర్ ట్యాంకుల ద్వారా మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నా ప్రజల అవసరాలు తీర్చలేక పోతున్నాయన్నారు. అడపాదడపా మరమ్మతుల పేరుతో మిషన్ భగీరథ నీరు సైతం సక్రమంగా అందడం లేదని.. దీంతో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని గ్రామస్తులు ఆరోపించారు.
కాగా గ్రామంలో కొందరు నల్లాలకు బిగించిన చర్రాలు తీసివేయడంతో వారి వెనక ఉన్న ఇండ్లకు నీరు అందడం లేదన్నారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ఎదురవుతున్న తాగునీటి ఇబ్బందులు తొలగించాలని, నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.