Tahawwur Rana | ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ రాణా (Tahawwur Rana)ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని అధికారులు భారత్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక విమానం అమెరికాలో బయల్దేరింది. ఇవాళ ఢిల్లీలో ల్యాండ్ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (special public prosecutor)గా నరేందర్ మాన్‌ను (Narender Mann) నియమిస్తూ కేంద్ర హోం శాఖ (MHA) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యేవరకు దిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తరఫున ఆయన వాదనలు వినిపించనున్నారు.
నిఘా అధికారులు, దర్యాప్తు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తహవూర్ రాణాను తీసుకుని ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి బయల్దేరింది. బుధవారం ఉదయం 7.10 (భారతీయ కాలమానం) గంటలకు బయల్దేరిన విమానం గురువారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటుందని వారు చెప్పారు. రాణా ఢిల్లీలో దిగిన వెంటనే ఎన్ఐఏ అతడిని అధికారికంగా అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలిస్తుంది. రాణా తరలింపు దృష్ట్యా తీహార్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో తహవూర్ రాణా ప్రధాన సూత్రదాడిగా తేలాడు. రాణాకు పాక్‌లోని లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకు ఉన్నది.
Also Read..
“Mumbai attack | అప్పుడు ఆ ఉగ్రవాదులిద్దరూ 231 సార్లు మాట్లాడుకున్నారట..!”
“Tahawwur Rana | రేపు ఉదయం భారత్‌కు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా”
“Tahawwur Rana: తహవుర్ రాణా స్టే పిటీషన్‌ను కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు”