Web Series Chance | సినిమాల్లో అవకాశాల పేరిట యువతిని మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వెబ్‌సిరీస్ ఆడిషన్ పేరుతో ఓ డైరెక్టర్ అసభ్య సన్నివేశాలు చిత్రీకరించి, తర్వాత వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సదరు డైరెక్టర్‌పై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో నటించాలనే కోరికతో ఓ యువతి (23) ఏపీలోని కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. యూసుఫ్‌గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌లో ఛాన్స్ కోసం శంకర్ అనే డైరెక్టర్‌ను కలిసింది. ఆడిషన్ పేరుతో ఆమెను తన కారులో ఎక్కించుకుని అసభ్య డైలాగులు చెప్పించాడు. అలాగే పలు అసభ్యకరమైన సన్నివేశాలు చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను శంకర్.. తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశాడు.
సోషల్‌మీడియాలో పెట్టిన ఆ వీడియోలు చివరకు యువతి తల్లిదండ్రుల దాకా వెళ్లాయి. అవి చూసిన పేరెంట్స్ సదరు యువతిని చివాట్లు పెట్టారు. దీంతో ఆ వీడియోలను డిలీట్ చేయాలని డైరెక్టర్ శంకర్‌ను కోరింది. కానీ అందుకు అతను వినిపించుకోలేదు. మరిన్ని సోషల్‌మీడియా ప్లాట్ఫామ్ల్లో పోస్టు చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ క్రమంలో సదరు యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.