మన్సూరాబాద్, సెప్టెంబర్ 16: నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధి బండ్లగూడలోని ఓ వైన్స్‌లో జరిగిన రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లి, కుటుంబసభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం, స్నేహితులని చూడకుండా తమతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆగ్రహం చెంది రౌడీషీటర్‌తో తిరిగే మిత్రులే వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ఎల్బీనగర్లోని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుమతి కేసు వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ఇల్లందుకు చెందిన మహ్మద్ నయీం (31) ప్రస్తుతం నాగోల్, బండ్లగూడ, రాజీవ్ స్వగృహ సముదాయాల్లోని సహభావన టౌన్షిప్లో నివాసముంటున్నాడు. ఓ మహిళతో సహజీవనం చేస్తూ.. వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నయీం పాత నేరస్తుడు.
ఇల్లందు పోలీస్‌స్టేషన్‌లో 8 కేసులు, ఉప్పల్ పీఎస్‌లో 1 కేసు, వనస్థలిపురం పీఎస్‌లో 1 కేసు, హయత్‌నగర్ పీఎస్‌లో 1 కేసు నయీంపై ఉన్నా యి.ఇల్లందులో ఓమర్డర్ కేసులో నిందితుడైన నయీం పై రౌడీషీట్ ఉంది. ఇల్లందుకి చెందిన ఓట్ల దినకర్ (35), ఇల్లందు పట్టణానికే చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కనకం ఉమా మహేశ్ (32), మహ్మద్ నయీం ముగ్గురు చిన్ననాటి మిత్రులు. ఓట్ల దినకర్, కనకం ఉమామహేశ్కి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. పాండిచ్చేరి, యానం, కొత్తపేటకి చెందిన సయ్యద్ రబ్బానీ (21) బాడీ బిల్డర్. ప్రస్తుతం నగరంలోని కూకట్‌పల్లిలో నివాసముంటూ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, శివసాయినగర్కి చెందిన ఒల్లిపొల్ల మహేశ్ (23) వృత్తిరీత్యా కూలీ పని చేస్తుంటాడు.
సయ్యద్ రబ్బానీ, మహేశ్ మిత్రులు. 2024లో మాదాపూర్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రమోషన్‌కి మహ్మద్ నయీం, ఓట్ల దినకర్, కనకం ఉమామహేశ్ వెళ్లారు. ప్రమోషన్స్‌కి బాడీ బిల్డర్‌గా వచ్చిన సయ్యద్ రబ్బానీ, మహ్మద్ నయీం గ్యాంగ్‌కి పరిచయమయ్యాడు. మహ్మద్ నయీం, ఓట్ల దినకర్, ఉమామహేష్, సయ్యద్ రబ్బానీ, ఒల్లిపొల్ల మహేశ్, చాంద్రాయణగుట్ట, పూల్బాగ్కి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ జబీ, కొత్తగూడెంకి చెందిన బోలె, ఖమ్మంకి చెందిన కార్తీక్ ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఉప్పల్ జరిగిన ఓ కేసులో 2025 జనవరిలో మహ్మద్ నయీం, దినకర్, ఉమామహేశ్, రబ్బానీ, మహేశ్, ఇస్మాయిల్ జబీ, బోలె, కార్తిక్ చర్లపల్లి జైలుకు వెళ్లినప్పుడు ఛత్రినాక, శివగంగనగర్కి చెందిన డెలివరీ బాయ్‌గా పని చేసే రాసమల్ల సాకేత్ (26) పరిచయం అయ్యాడు. రాసమల్ల సాకేత్ గ్యాంగ్‌లో జీహెచ్ఎంసీలో పనిచేసే తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, మణిక్యనగర్కి చెందిన అలకుంట వెంకట్ (22), ఉప్పుగూడ, శివాజీనగర్కి చెందిన ఆటో డ్రైవర్‌గా పని చేసే కోడిగంటి రాఘవేందర్ అలియాస్ రఘు (27), ఛత్రినాక, కందిగల్ గేటుకి చెందిన వల్లపుదాసు చరణ్‌గౌడ్ (21), ఖమ్మం పట్టణానికి చెందిన మహ్మద్ బద్రుల్ల హుస్సేన్ అలియాస్ బద్రి (22) పని చేసే వారు.
క్రిమనల్ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉన్న మహ్మద్ నయీం వీరిపై పెత్తనం చేస్తుండే వాడు. మహ్మద్ నయీం మద్యం తాగిన అనంతరం రబ్బానిని దూషించడంతో పాటు.. ఎక్కడో ఉండే రబ్బాని తల్లిని తిట్టేవాడు. దీంతో రబ్బానీ, నయీంకు దూరంగా ఉండాలని భావించాడు. దీంతో పాటు నయీంకి కనకం ఉమామహేశ్, దినకర్‌తో విభేదాలు ఏర్పడ్డాయి. మహ్మద్ నయీం అరాచకాలు రోజు రోజు పెరుగుతుండటంతో ఎలాగైనా అతడిని అంతమొందించాలని కనకం ఉమామహేశ్, దినకర్‌తో పాటు సయ్యద్ రబ్బానీ పథకం వేసుకున్నారు. రబ్బాని తన మాజీ జైలు సహచరుడు రాసమల్ల సాకేత్ సహాయం కోరాడు. 2024-25లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో నయీం తనను వేధించాడనే కారణంతో సాకేత్ కూడా కక్ష పెంచుకుని ఉన్నాడు. నయీం హత్య పథకంలో సాకేత్‌తో పాటు అతడి అనుచరులు పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈనెల 14న నాగోల్, బండ్లగూడలోని సుప్రీం వైన్స్ వద్దకు చేరుకున్నారు. వైన్ దుకాణం లోపలికి వెళ్తూనే ఇద్దరు మహ్మద్ నయీం కళ్లల్లో కారం చల్లగా.. మరి కొందరు తమ వెంట తెచ్చుకున్న వేట కొడవలి, సుత్తితో దాడి చేశారు. మరి కొందరు కడాయి తీసుకుని నయీం తలపై, ఛాతిపై మోదారు. దీంతో నయీం అక్కడికక్కడే మృతి చెందాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు..వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. నయీంను హత్య చేసిన అనంతరం ఛత్రినాకలో తలదాచుకున్న సయ్యద్ రబ్బానీ, ఒట్ల దినకర్, ఒల్లిపొల్ల మహేశ్, రాసమల్ల సాకేత్, అలకుంట వెంకట్, కొడిగంటి రాఘవేందర్, వల్లపుదాసు చరణ్‌గౌడ్, మహ్మద్ బద్రుల్ల హుస్సేన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం తమపై చేస్తున్న ఆరాచకాలు, కుటుంబసభ్యులపై చేస్తున్న దూషణల కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.