Mumbai attack : ముంబైలో 26/11 ఉగ్రదాడుల (Terror attacks) కుట్రదారుడు తహవూర్ రాణా (Tahawwur Rana) ను అమెరికా భారత్‌కు అప్పగించింది. ప్రస్తుతం అతడిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ రాబట్టిన కీలక విషయాలను ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. 2008 ముంబై ఉగ్రదాడికి ముందు రాణాతో పాకిస్థాన్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ (David Headley) టచ్‌లో ఉండేవాడని ఎన్ఐఏ తెలిపినట్లు ఆ మీడియా పేర్కొంది.
26/11 దాడికి ముందు ఎనిమిది సార్లు హెడ్లీ భారత్‌కు వచ్చాడని, ఆ సమయంలో 231 సార్లు అతను రాణాతో సంప్రదింపులు జరిపాడని ఆ మీడియా సంస్థ తన కథనంలో తెలిపింది. దాడులకు ముందు 2006 సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్‌కు వచ్చి రెక్కీ నిర్వహించాడని.. అప్పుడు 32 సార్లు రాణాతో మాట్లాడాడని పేర్కొంది. హెడ్లీ భారత్‌కు వచ్చినప్పుడల్లా.. రాణాతో ఒకసారి 23 సార్లు, మరోసారి 40 సార్లు, ఇంకోసారి 66 సార్లు.. ఇలా చాలాసార్లు మాట్లాడినట్లు తెలిపింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహకరించాడో ఎన్ఐఏ పత్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని వెల్లడించింది.
ఇదిలావుంటే ముంబై దాడుల మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు అంతకుముందే పరిచయముంది. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో రాణాకు హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. ప్రస్తుతం రాణాకు అమెరికాలో చట్టపరమైన అవకాశాలన్నీ చేజారాయి. దాంతో అతడిని భారత్‌కు అప్పగించారు. ప్రస్తుతం అతడిని తీసుకుని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఇండియాకు తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి లేదంటే రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత్‌కు చేరుకోనున్నట్లు సమాచారం.