హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం 2026-27 కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 26న జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి ఓట్ల లెకింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను మార్చి 10న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలు గడువు మార్చి 12 సాయంత్రం 4:30 గంటలకు ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి నామినేషన్లను పరిశీలించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు.
నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు గడువు ఉం టుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. హైకోర్టు బార్ అసోసియేషన్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇద్దరు కార్యదర్శులు, మహిళల కోటాలో జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ పదవులతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీకి 25 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. వీరిలో 15ఏండ్లకుపైగా అనుభవమున్న న్యాయవాదుల కోటాలో ఇద్దరు (ఒకరు మహిళ), మహిళల కోటాలో ఇద్దరు, జనరల్ కోటాలో ముగ్గురు సభ్యులు ఉంటారు.