గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఇలా ప్రారంభమైతే.. అలా పూర్తయ్యేవి. ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఏళ్లు గడిచినా పనులు మాత్రం మొదలు కావడం లేదు. ఇందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇండస్ట్రియల్ పార్కు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తాయి. ఏడాదిన్నర క్రితం గణపురం మండలం మైలారం గుట్ట మీద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే ఆర్భాటంగా శిలాఫలకాలు వేశారే తప్ప.. ఇప్పటికీ అంగుళం నిర్మాణం జరగలేదు. వీటికోసం ఇక్కడ కేటాయించిన వందెకరాల స్థలం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును వెక్కిరిస్తున్నది.
– జయశంకర్ భూపాలపల్లి, మార్చి 9 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్.. ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి చాలా ఆర్భాటం చేసింది. ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు ఈ పనులకు శిలాఫలకాలు వేసి విస్తృత ప్రచారం చేసుకున్నారు. ఇంతవరకు పైసా పనులు మొదలు కాలేదు. ఏనాడో వేసిన సీసీ రోడ్లు తప్ప.. రాళ్లు, రప్పలే అక్కడ దర్శనమిస్తున్నాయి. చివరికి అక్కడ వేసిన శిలాఫలకాలు కూడా మాయమయ్యాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రూ. 200 కోట్లు, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు రూ. 4.50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పి వంద ఎకరాల స్థలం కేటాయించి చేతులు దులుపుకున్నారు.
అసలు ఈ పనులకు నిధులు మంజూరయ్యాయా? లేదా ముందు శిలాఫలకాలు వేద్దాం.. తరువాత ఆలోచిద్దాం అనే ధోరణిలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నరగా పనులు ప్రారంభం కాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాల సమీపంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే దర్శనమిస్తున్నాయి. ఇదొక్కటే కాదు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనులు మొదలు కాక కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాలన్నీ వారి పనితీరును వెక్కిరిస్తున్నాయి.

ఆర్భాటానికే పరిమితం..
మైలారం గుట్టపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇండస్ట్రియల్ పార్కు నిర్మిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హంగామా ఆర్భాటాలకే పరిమితమైంది. గుట్టపై గల 40 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ (ఏడు విద్యా సంస్థలు)కు శిలాఫలకం వేశారు. ఇది కాకుండా మరో 10 ఎకరాల్లో కేంద్రీయ విద్యాలయం, 20 ఎకరాల్లో నవోదయ సైనిక్ స్కూల్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. వీటికి సంబంధించిన స్థలాన్ని సైతం కేటాయించినట్లు చెప్పారు. ఇందులో ఏ ఒక్కదానికీ అతీ గతీ లేదు.
అలాగే ఇండస్ట్రియల్ పార్కు కోసం ఇక్కడే 60 ఎకరాలు కేటాయించగా, 500 స్కేర్ మీటర్లలో 121 ప్లాట్లు, 1000 స్కేర్ మీటర్లలో 55, 1500 స్కేర్ మీటర్లలో 21 ప్లాట్ల ఏర్పాటుతో పాటు ప్రహరీ, అప్రోచ్ రోడ్లు, డ్రైన్స్, పవర్, వాటర్ సైప్లె చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కాగా, ఈ రెండింటిలో ఏ ఒక్కదాని పని ఇంకా ప్రారంభం కాలేదు. కనీసం భూమి చదును సైతం పూర్తిస్థాయిలో జరగలేదు. అధికారులు మాత్రం త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. నిధుల కేటాయింపు జరిగిందా? అనే ప్రశ్నకు ఉన్నతాధికారులను అడగాలంటూ సమాధానమిస్తున్నారు.
మైలారం గుట్టపై నిశ్శబ్దం..
భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండ లం గాంధీనగర్ సమీపంలోని మైలారం గుట్ట పై ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడంతో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలతో పాటు మిషన్ భగీరథ పంప్ హౌస్ మాత్రమే కనిపిస్తున్నాయి. గుట్టపై సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా కొంతవరకు ఆక్రమణకు గురైంది. కాగా గుట్టపై 205/1, 204 సర్వే నంబర్లలోని సుమారు 100 ఎకరా ల ప్రభుత్వ భూమిని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇండస్ట్రియల్ పార్కు కోసం రెవెన్యూశాఖ కేటాయించింది.
అయితే, ఈ స్థలం కేటాయింపు సీసీఎల్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్న ది. ఇందులో 40 ఎకరాలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు, 60 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కుకు కేటాయించారు. వీటిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క శిలాఫలకాలు వేశారు.