నాగర్‌కర్నూల్: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ( CITU ) నాయకులు సోమవారం జైల్ భరో( Jailbaro ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన సభ అనంతరం పోలీసులు సీఐటీయూ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు ( Arrest ) చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ పెట్టుబడి దారులకు మేలు చేసే విధానాలు అవలంభిస్తుందని విమర్శించారు. ఎంతోమంది పోరాట త్యాగాలతో సాధించుకున్న దేశ స్వతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టుపెట్టే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని , 29 పాత చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఐద్వా జిల్లా కార్యదర్శి కే గీత , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సుభాష్, ఐకెపీ వీవోఏల సంఘం రాష్ట్ర కోశాధికారి సుమలత , మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర అధ్యక్షులు పసియోద్దీన్ , జిల్లా అధ్యక్షురాలు సునీత, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, ఆయా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.