Independence Day : ఇండియా-రష్యా మధ్య విడదీయలేని మైత్రి ఉంది. దశాబ్దాలుగా రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇండియాకు నమ్మదగిన మిత్ర దేశంగా రష్యాకు పేరుంది. అందుకే ఆ దేశ పౌరులు, శాస్త్రవేత్తలు, నిపుణులు కూడా ఇండియాను అభిమానిస్తుంటారు. తాజా ఘటనే ఇందుకు ఉదాహరణ. మరో ఐదు రోజుల్లో ఇండియా ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన అంతరిక్ష యాత్రికులు ఇండియాకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారతీయ త్రివర్ణ పతాకాన్ని చేబూని, అంతరిక్షం నుంచి ఇండియాకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.
వ్యోమగాములు పాట్ర్ డుబ్రోవ్తోపాటు ఆండ్రే ఫెడేవ్, అన్నా కికినా అనే ముగ్గురు సభ్యుల బృందం ఒక వీడియో ద్వారా సందేశం పంపించారు. రష్యా (సోవియట్ యూనియన్) వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్ష యాత్ర చేసి, 65 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని కూడా వీరు ప్రస్తావించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా యూరి గగారిన్ చరిత్ర సృష్టించాడు. ఆయన ఇండియాలో కూడా పర్యటించారు. రష్యా వ్యోమగాములు మాట్లాడుతూ.. అంతరిక్షం నుంచి ఇండియాకు విషెస్ చెప్పడమే కాకుండా.. అక్కడి నుంచి ఇండియా ఎంతో అందంగా కనిపిస్తుందని ప్రశంసించారు. ఇండియా, రష్యా మధ్య మైత్రి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఇండియా-రష్యా మధ్య అంతరిక్ష సహకారం 1975లో ప్రారంభమైంది.
ఇండియా రూపొందించిన తొలి శాటిలైట్ ఆర్యభట్టను అప్పట్లో రష్యా ఆధ్వర్యంలోని సోవియట్ యూనియన్ ప్రయోగించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఇండియా, రష్యా మధ్య అంతరిక్షంతోపాటు రక్షణ రంగం, ఇతర రంగాల్లో పరస్పర సహకారం అందించుకుంటూ బంధాన్ని కొనసాగిస్తున్నాయి. భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ కూడా అంతరిక్షంలోకి వెళ్లింది సోవియట్ యూనియన్‌కు చెందిన సోయుజ్ టీ-11 నౌకలోనే.