వరంగల్ లీగల్, మార్చి 9 : తొమ్మిదో తరగతి బాలికను ప్రేమ పేరుతో వంచించిన నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా జడ్జి అపర్ణాదేవి సోమవారం తీర్పు వెలువరించారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం పైడిపల్లికి చెందిన బాలికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలుకూరు మండలానికి చెందిన బండి నవీన్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. 2020 డిసెంబర్ 2వ తేదీన కిడ్నాప్ చేయగా.. బాలిక సోదరుడు పరకాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఏసీపీ శ్రీనివాస్ దర్యాప్తు చేయగా, ఇప్పటి ఏసీపీ శివరామయ్య చార్జిషీట్ దాఖలు చేశారు. భరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ నీరజ పర్యవేక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమల్లారెడ్డి బాధితురాలి పక్షాన వాదించారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించారు. బాలికకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. కోర్టు డ్యూటీ పోలీస్ సురేందర్ ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టారు.