Mangoes | సీజనల్ గా మనకు అనేక రకాల పండ్లు లభిస్తుంటాయి. వేసవి కాలంలోనూ మనకు పలు రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో మామిడి పండ్లు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ పండ్లు సీజన్లో విరివిగా అందుబాటులో ఉంటాయి. జూలై నెల వరకు మామిడి పండ్లను ప్రజలు తింటూనే ఉంటారు. మామిడి పండ్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. మామిడి పండ్లలో అనేక రకాల వెరైటీలు ఉంటాయి. కొందరు రసాలు అంటే ఇష్టపడతారు. కొందరికి కోత మామిడి పండ్లు ఇష్టం. ఆలా భిన్న రకాల రుచులను కలిగి ఉంటారు. మామిడి పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు చర్మాన్ని సంరక్షిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లను తింటే మేలు జరుగుతుంది.
మామిడి పండ్లలో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. అలాగే విటమిన్ సి వల్ల మన శరీరం కొల్లాజెన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. మామిడి పండ్లను తరచూ తింటే వాటిల్లో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు పేగులు, రొమ్ము, ప్రోస్టేట్, ల్యుకేమియా వంటి క్యాన్సర్లు రాకుండా చూస్తాయి.
100 గ్రాముల మామిడి పండ్లను తింటే సుమారుగా 70 క్యాలరీల శక్తి లభిస్తుంది. 17 గ్రాముల పిండి పదార్థాలు, 445 మైక్రో గ్రాముల బీటా కెరోటిన్, 765 మైక్రో గ్రాముల విటమిన్ ఎ, 1.12 మైక్రో గ్రాముల విటమిన్ ఇ, 4.2 మైక్రో గ్రాముల విటమిన్ కె, 156 మిల్లీగ్రాముల పొటాషియం, 0.5 గ్రాముల ప్రోటీన్లు, 27.7 మిల్లీగ్రాముల విటమిన్ సి, 1.8 గ్రాముల పీచు లభిస్తాయి. మామిడి పండ్లలో ఫైటో కెమికల్స్ పాలిఫినాల్స్, 17 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. మామిడి పండ్లలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీ తగ్గేలా చేస్తుంది. హైబీపీ ఉన్నవారు మామిడి పండ్లను తింటే మేలు జరుగుతుంది. మామిడి పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.
మామిడి పండ్లను తింటే పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకుంట శరీరానికి బలం కలుగుతుంది. సన్నగా ఉన్నవారు బరువు పెరుగుతారు. మామిడి పండ్లలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. మామిడి పండ్లతో ఫేస్ ప్యాక్‌లను తయారు చేసి ఉపయోగించవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. అయితే మామిడి పండ్లతో లాభాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఈ పండ్లను అతిగా తినకూడదు. తింటే విరేచనాలు అయ్యి శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ పండ్లను మోతాదులోనే తినాలి.