రామగిరి, మార్చి 06 : పాఠశాల స్థాయిలోని బాల, బాలికలకు హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలని, దీంతో నవ సమాజం వాటి బారిన పడకుండా ఉంటుందని విద్యాశాఖ సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారి ఆర్.రామచంద్రయ్య అన్నారు. నల్లగొండలోని డైట్లో విద్యాశాఖ- సమగ్రశిక్ష ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో జిల్లా స్థాయిలో కౌమార విద్యపై- ఉపాద్యాయులకు శిక్షణ, విద్యార్థులకు పోస్టర్ పెయింటింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కౌమార విద్యా కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 84 ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి ఆయా పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు కౌమార దశలో కలిగే శారీరక, మానసిక, ఉద్వేగ పరమైన మార్పులపై అవగాహన కల్పించామన్నారు. అదే విధంగా హెచ్ఐవీ, ఎయిడ్స్, సంక్రమిత వ్యాధుల నివారణకు అవసరమైన జీవన నైపుణ్యాలను పెంపొందించడం విద్యార్థులకు శిక్షణతో పాటు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోస్టర్ పెయింటింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు అందచేసినట్లు వెల్లడించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సమన్వయకర్త వి.సుధాకర్ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులు కౌమార దశ నుండే హెచ్ఐవీ, ఎయిడ్స్ పట్ల పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. హెచ్ఐవీ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులు సర్టిఫికెట్స్, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్ ఆర్రూరు జానయ్య, జిల్లాలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, గైడ్ టీచర్స్ పాల్గొన్నారు.
పోస్టర్ పెయింటింగ్ మేళాలో ప్రథమ బహుమతి ఆరీష, తండీస్- 8వ తరగతి- లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన మందిర్, నల్లగొండ, ద్వితీయ బహుమతి సిద్ధతుల్ ముంతెన, 3వ తరగతి, జడ్పీహెచ్ఎస్ (బాలికలు) దేవరకొండ.