Ramagundam | కోల్ సిటీ: రామగుండం (Ramgundam) నగరపాలక సంస్థలో ఐదు నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం లేదు. ఈ విషయంపై బీఆర్ఎస్ 12 వ డివిజన్ మాజీ కార్పొరేటర్, ఫైవ్ ఇన్క్లైన్ పట్టణ అధ్యక్షులు బొడ్డు రజిత రవీందర్ బుధవారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలక చట్టం ప్రకారం నెలకోసారి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలి. కానీ రామగుండం కార్పొరేషన్ లో ఐదు నెలలుగా నిర్వహించకపోవడం ప్రజల గొంతు నొక్కడమేనని అన్నారు. కౌన్సిల్ పెట్టడానికి అధికార పార్టీ కి భయమెందుకు? ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపేది? అని ప్రశ్నించారు. ఐదు నెలలుగా కౌన్సిల్ మీటింగ్ నిర్వహించకపోతే ప్రజల సమస్యలు ఎక్కడ చర్చించాలి? ఇది అధికారుల నిర్లక్ష్యమా? ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదా? అని ఆరోపించారు.
మున్సిపల్ నిబంధనలను పక్కనపెట్టి కౌన్సిల్ సమావేశాలను నిర్వహించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్ల గొంతును కౌన్సిల్లో వినిపించకుండా చేయడం ప్రజల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై (Issues) ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం లేకనే కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేస్తున్నారా? అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుని వెంటనే కౌన్సిల్ సమావేశం నిర్వహించేలా ఆదేశించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీని కోరినట్లు తెలిపారు. కౌన్సిల్ పాలకుల జాగీరు కాదు, ప్రజల వేదిక, ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోం, ప్రభుత్వం స్పందించే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం అని ఆయన హెచ్చరించారు.