Ramayana Sets | బాలీవుడ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ అయిన ‘రామాయణ’ (Ramayana) షూటింగ్ సెట్లో ఊహించని అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని ప్రముఖ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ (Prime Focus Studios) ప్రాంగణంలో ఈ అపశృతి చోటు చేసుకుంది. సెట్‌కు వెలుపల వేసిన తాత్కాలిక టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టూడియో సిబ్బందితో పాటు చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్టూడియో రక్షణ బృందాలు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగాయి. తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బి.ఎన్. తివారీ అధికారికంగా స్పష్టం చేశారు. అయితే, ఘటన జరిగిన సమయంలో సెట్లో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉండటంతో కొంతసేపు తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.