Naresh | తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ నేపథ్యాలు, యాసలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ సినిమా, రాయలసీమ సినిమా, ఉత్తరాంధ్ర సినిమా అంటూ సినిమాలను ప్రాంతాల వారీగా విభజించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రఖ్యాత బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నరేష్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో సినిమాలకు ప్రాంతీయ ముద్రలు వేయడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని వీకే నరేష్ అన్నారు. తెలంగాణ సినిమా, రాయలసీమ సినిమా, ఉత్తరాంధ్ర సినిమా అంటూ విభజించడం కంటే సినిమాను సినిమాగానే చూడాలని సూచించారు.
పాటలకు, సంగీతానికి ఎలాంటి సరిహద్దులు ఉండవో సినిమాలకు కూడా అలాంటి హద్దులు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. కొరియన్, మలయాళ, తమిళ సినిమాలను భాషా భేదాలు లేకుండా ఆదరిస్తున్న ప్రేక్షకులు.. తెలుగు సినిమాలను మాత్రం ప్రాంతాల పేరుతో విడదీయడం సరికాదని వ్యాఖ్యానించారు. గతంలో తమిళంలో వచ్చిన ‘మణ్ వాసనై’ చిత్రాన్ని ఉదాహరణగా ప్రస్తావించిన నరేష్.. మట్టి వాసన అనేది ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో పరిమితమైన విషయం కాదన్నారు. భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికీ మట్టితో అనుబంధం ఉంటుందని చెప్పారు. అదే విధంగా ‘గరివిడి లక్ష్మి’ సినిమాలోని కథ, భావోద్వేగాలు కూడా ప్రాంతీయ హద్దులను దాటి ప్రతి తెలుగు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయని నరేష్ అభిప్రాయపడ్డారు. సినిమాలోని నిజాయితీనే అసలైన వినోదంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
దసరా పండుగ సీజన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా వీకే నరేష్ గుర్తుచేసుకున్నారు. దసరా సమయంలో తన సినిమాలకు సుమారు 70 శాతం విజయాల రేటు ఉందని తెలిపారు. తాను ఎప్పుడూ ప్యాకేజీల కోసం సినిమాలు చేయలేదని, మంచి ప్రాజెక్టులకు తన వంతు సహకారం అందించడానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు మంచి విజయాలు సాధిస్తాయని, అందులో తొలి విజయం ‘గరివిడి లక్ష్మి’దేనని నరేష్ ధీమా వ్యక్తం చేశారు. సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందనేది తర్వాతి విషయం కానీ, ప్రేక్షకుల ఆదరణతో విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. బయోపిక్ అంటే కేవలం డాక్యుమెంటరీ తరహాలో ఉండాల్సిన అవసరం లేదని నరేష్ అన్నారు. ‘మహానటి’ తర్వాత మరో అసాధారణ మహిళా కళాకారిణి జీవితాన్ని సంగీతం, వినోదం, భావోద్వేగాలతో ‘గరివిడి లక్ష్మి’లో చూపించారని ప్రశంసించారు. \. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణతో పాటు ఈ చిత్రానికి జాతీయ అవార్డులు కూడా రావాలని కోరుకుంటున్నట్లు నరేష్ తెలిపారు. అవసరమైతే సినిమా కోసం తానే స్వయంగా ప్రచారం చేస్తానని చెప్పారు.