జెరుసలాం: ఫ్లైదుబాయ్ 1073 విమానం(Flydubai Flight)లో పైలట్ మచ్చర్‌పై ఒమనీ కోపైలట్ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే 170 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని కూల్చేందుకు ఇజ్రాయెల్ సిద్దమైనట్లు తెలిసింది. సౌదీ అరేబియాలో ఆ విమానం దిగడానికి ముందు ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ మోహరించినట్లు సీబీఎస్ న్యూస్ వార్తా కథనం ద్వారా వెల్లడైంది. దుబాయ్ నుంచి ఫ్లైదుబాయ్ విమానం బయలుదేరిన తర్వాత.. అకస్మాత్తుగా ఆ ప్లేన్ దారి మళ్లింది. ఆ సమయంలో విమానం నుంచి ఎటువంటి సమాధానం అందకపోవడంతో.. ఇజ్రాయిలీ వైమానిక దళం ఆ విమానాన్ని షూట్ చేసేందుకు సిద్దమైనట్లు తెలిసింది.
ఫ్లైదుబాయ్ విమానం దారి మళ్లడంతో ఇజ్రాయెల్ అధికారులు తక్షణమే ఓ కమిటీని ఏర్పాటు చేశారని, కమాండ్ సెంటర్‌ను కూడా సెటప్ చేశారని, ఇజ్రాయిలీ వైమానిక క్షేత్రాన్ని మూసివేసి, ఫైటర్ జెట్లను మోహరించినట్లు సీబీఎస్ న్యూస్ మీడియా నివేదికలో పేర్కొన్నారు. ఒకవేళ విమానం తమ వైమానిక క్షేత్రానికి దగ్గరగా వస్తే, జోర్డాన్‌లోని వైమానిక క్షేత్రానికి తమ యుద్ధ విమానాలను పంపి, దీనిపై ఇన్వెస్టిగేషన్ చేపట్టేవాళ్లమని ఇజ్రాయెల్ పేర్కొన్నది.
కాక్‌పిట్‌తో విజువల్ కాంటాక్టు ఏర్పాటు చేసుకోవడానికి వీలైనంత దగ్గర ఐఏఎఫ్ పైలట్లు చేరుకునేవారని, ఆ పరిస్థితిని అంచనా వేసేవాళ్లమన్నారు. ఒకవేళ విమానాన్ని హైజాక్ చేసి, ఉగ్రవాదులు రెస్పాండ్ కాకుంటే, ఆ విమానాన్ని చెక్ చేసిన తర్వాత, కమిటీకి ఐఏఎఫ్ సమాచారాన్ని చేరవేసేదని, ఆ తర్వాత ఆ విషయాన్ని డిఫెన్స్ మినిస్టర్, ప్రధానికి తెలియజేసేవారని రిపోర్టులో తెలిపారు. కానీ విమానాన్ని షూట్ చేసే తుది నిర్ణయం మాత్రం ప్రధాని చేతుల్లో ఉంటుందని సీబీఎస్ న్యూస్ రిపోర్టులో పేర్కొన్నారు. బెన్ గురియన్ విమానాశ్రయం, అజ్రేలీ సెంటర్ లేదా హై వాల్యూ టార్గెట్‌ను ఢీకొట్టడం కన్నా.. విమానాన్ని పేల్చడమే ఉత్తమంగా భావించేవాళ్లమని ఇజ్రాయెల్ వర్గాలు ఆ కథనంలో పేర్కొన్నాయి.
కాక్‌పిట్‌లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై అటాక్ జరిగిన సమయంలో అతను మేడే కాల్ ఇచ్చాడు. ఆ తర్వాత కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేయడంతో.. ఆ విమాన ప్రయాణికులు కోపైలట్‌ను నిర్బంధించారు. ఇజ్రాయెల్‌లో ఆ విమానాన్ని కూల్చాలని ఒమనీ కోపైలట్ భావించినట్లు దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతం స్మిత్ మచ్చర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.