నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలు కోల్పోయిన టీ స్టాల్ నిర్వాహకుడు సుధాకర్ మృతదేహాన్ని నివాళులర్పించేందుకు వెళ్లకుండా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దే పోలీసులు నిలిపివేయడంతో భీమ్‌గల్ వెళ్లలేకపోయారు.
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “చనిపోయిన వ్యక్తిని కడసారి చూసేందుకు కూడా వెళ్లనివ్వరా? కనీసం చివరి చూపు చూసి నివాళులర్పించే అవకాశం కూడా లేదా?” అని ప్రశ్నించారు.
పోలాస సుధాకర్ ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేని సాధారణ వ్యక్తి అని, టీ స్టాల్ నిర్వహించుకుంటూ జీవనం సాగించేవారని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మృతిచెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతదేహానికి నివాళులర్పించేందుకు మాత్రమే తాను వెళ్తున్నానని చెప్పారు. అయినప్పటికీ తనను ఇంటి వద్దే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
“ఒక సాధారణ వ్యక్తి మృతిపై సానుభూతి వ్యక్తం చేయడానికి కూడా ప్రజాప్రతినిధికి స్వేచ్ఛ లేకపోవడం బాధాకరం. ప్రజా పాలన పేరుతో ఇలాంటి నిర్బంధం ఎందుకు?” అని వేముల ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు.
సుధాకర్ మృతిపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.