RTC Bus | మునిపల్లి, అక్టోబర్ 29 : ఆర్టీసీ బస్సులో ప్రయాణం భద్రమని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బస్సులు రాకపోకలు సాగించేందుకు రోడ్లు సైతం అంతే ముఖ్యమని ఎందుకు చెప్పడం లేదని మునిపల్లి మండల వాసులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుఫై తీవ్రంగా మండిపడుతున్నారు. బుధవారం మండలంలోని బోడపల్లి, చిన్న చెల్మడ, ఖమ్మంపల్లి గ్రామాల మీదుగా మండల కేంద్రమైన మునిపల్లికి వెళ్లే ఆర్టీసీ బస్సుకు ఖమ్మంపల్లి గ్రామ శివారులోకి రాగానే తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు, ప్రయాణికులు వెల్లడించారు.
ఈ సందర్బంగా స్థానికులు, ప్రయాణికులు మాట్లాడుతూ.. ఖమ్మంపల్లి-మునిపల్లి రోడ్డు పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. బోడపల్లి చిన్న చెల్మడ, ఖమ్మంపల్లి గ్రామాల నుంచి స్కూల్ విద్యార్థులు, ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న క్రమంలో ఖమ్మంపల్లి-మునిపల్లి మధ్య రోడ్డు బాగాలేకపోవడంతో బస్సు అదుపు తప్పి గుంతలోకి దూసుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తమై బస్సును కంట్రోల్ చేయడంతో ప్రయాణికులు బస్సు నుండి దిగి ప్రైవేట్ వాహనాల్లో వారి వారి గమ్యాలకు వెళ్లిపోయారు.
ఆగస్టు 22న మంత్రి చేత పనులు ప్రారంభం..
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మునిపల్లి- ఖమ్మంపల్లి గ్రమానికి నూతన రోడ్డు నిర్మాణం పనులు ఆగస్టు 22న ప్రారంభించారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభానికి పరిమితమైనవి తప్ప పనులు ప్రారంభం కాలేదు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యమా.. ప్రభుత్వ నిర్లక్ష్యమా..? రోడ్డు నిర్మాణ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు దర్శనమిస్తున్నాయి.
మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకొని మండలంలోని గ్రామాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కలిపించేందుకు నూతన రోడ్డు నిర్మాణాలు నిర్మించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.

Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల