Rains | జహీరాబాద్, ఆగస్టు 27 : జహీరాబాద్ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల ధాటికి ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మూగజీవులు ఆరుబయటకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలోని బసంత్ పూర్ఎ మెటల్ కుంటఎ-రేజింతల్ వెలుగోయ్, చాలికి- చీకుర్తి, జహీరాబాద్ మండలంలోని బూచినేని- ఘనపూర్, రాయిపల్లి డి, ఝరాసంగం మండలంలోని పాట్పల్లి, పోలవరం, మేదపల్లి గ్రామాల శివారులోని వాగులు కల్వర్టులపైనుంచి ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి. దీంతో ఆయా గ్రామాల మీదుగా రాకపోకలను సంబంధిత అధికారులు నిలిపివేశారు.
న్యాల్కల్ మండలం మీదుగా ప్రవహించే మంజీరా నదిలోకి కర్ణాటకలోని ఎగువ ప్రాంతంతోపాటు జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది. జహీరాబాద్ మండలం పరిధిలోని కొత్తూరు బి నారింజవాగులోకి వరద నీరు భారీగా చేరడంతో రెండవ గేటు పైకి లేపి దిగువకు వరద నీరును వదిలిపెట్టారు. దీంతో నారింజ వాగు ప్రాజెక్టు పరిధిలోని ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయా మండలాల్లోని గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతోపాటు కురుస్తున్న భారీ వర్షాలతో పంట పొలాల్లోకి వరద నీరు భారీగా చేరింది. కోతకు వచ్చిన పెసర, మిను పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిని ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు నిలవడంతో వాహన చోదకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కుండపోత వర్షాలతో వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాల ప్రతిష్టాపనకు ఆటంకాలు తప్పడం లేదు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Health tips | మొక్కజొన్నతో గుండెకు మేలు.. ఇంకా ఎన్ని లాభాలో..!
Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. వరదలకు కొట్టుకుపోయిన కార్లు
CP Radhakrishnan | తిరుమలకు చేరుకున్న ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి