కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు చెరవులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. అలేగే కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునకేసింది. జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుతో నిండిపోయింది. అనేక కాలనీలో జలమయమై కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద నీరు చేరడంతో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు పోలీసులు చేర్చుతున్నారు. కామారెడ్డి పెద్ద చెరువు ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడు లేని విధంగా భూమికి సమాంతరంగా పెద్ద చెరువు నీళ్లు పారుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద చెరువుకు ఆనుకుని ఉన్న కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.