Health tips : వానాకాలం (Rainy season) వర్షం పడుతుంటే మొక్కజొన్న (Makka jonna) కంకులు కాల్చుకొని వేడివేడిగా తినాలనిపిస్తుంది. అలా తింటుంటే ఆ మజానే వేరు. మొక్కజొన్న కంకులు రుచిగా ఉండటమే కాదు, ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. మొక్కజొన్న గింజల్లో నీటిలో కరగని పీచు (Fiber) పుష్కలంగా ఉంటుంది. అందుకే అవి ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజు కూడా నెమ్మదిగా కలుస్తుంది. మొక్కజొన్న కంకులను కాల్చుకుని, ఉడికించి, పచ్చిగా ఎలాగైనా తినొచ్చు. కార్న్ ఫ్లేక్స్, పాప్‌కార్న్ రూపంలోనూ వీటిని లాగించేయొచ్చు. మరి మొక్కజొన్నలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
మొక్కజొన్నలో కరగని పీచు దండిగా ఉంటుంది. అది మలబద్ధకాన్ని నివారిస్తుంది. గింజల లోపలి పలుకుల్లో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు, పీచు ఉంటాయి. వీటిని శరీరం బాగా జీర్ణం చేసుకుంటుంది. కానీ సెల్యులోజ్‌తో కూడిన వెలుపలి గట్టి భాగం జీర్ణం కాదు. ఇది పేగుల్లో పులిసిపోతుంది. అందుకే మొక్కజొన్న గింజలను ఎక్కువగా తిన్నప్పుడు పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంటుంది. మొక్కజొన్నలోని ఈ పీచు ప్రీ బయాటిక్‌గా పనిచేసి పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎదగటానికి తోడ్పడుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియా మొక్కజొన్నను షార్ట్ చెయిన్ కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. ఇది పెద్దపేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
ఒక్క మొక్కజొన్న పొత్తులోని గింజల్లో సుమారు 900 మైక్రోగ్రాముల యాంటీ ఆక్సిడెంట్లు (ల్యుటీన్, జియాగ్జాంతీన్) ఉంటాయి. ఇవి చూపు మెరుగుపడటానికి, కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తున్నట్టు ఒక అధ్యయనం తెలిపింది. దీర్ఘకాల వాపు, గుండెజబ్బు, క్యాన్సర్ల వంటి వాటికి దారితీసే విశృంఖల కణాల బారి నుంచి యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి తోడ్పడతాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలోనూ సాయం తోడ్పడుతాయి.
మొక్కజొన్న గింజలతో తయారుచేసే నూనెలో ఫైటోస్టెరాల్స్ అనే సహజ వృక్ష పదార్థముంటుంది. ఇది శరీరం కొలెస్ట్రాల్‌ను తక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. దీనిలో గుండెకు మేలు చేసే యుబిక్వినోన్ అనే విటమిన్ కూడా ఉంటుంది. ఇది గుండె దెబ్బతినకుండా కాపాడుతుంది. తక్కువ మోతాదులో వాడుకున్నంత వరకు మొక్కజొన్న నూనె ఆరోగ్యానికి మేలే చేస్తుంది. దీనిలోని ఆరోగ్యకరమైన బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మంచి శక్తిని అందిస్తాయి.
మొక్కజొన్న గింజల్లోని సహజ చక్కెరలే వాటికి తీపి రుచిని తెచ్చిపెడతాయి. అయితే వీటిల్లో చక్కెర మోతాదు తక్కువే. ఒక మాదిరి పొత్తులో సుమారు 4 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. ఎర్రటి యాపిల్ పండుతో లభించే చక్కెరతో పోలిస్తే ఇది మూడో వంతు కన్నా తక్కువే.
మొక్కజొన్నలో గ్లుటెన్ ఉండదు. అందువల్ల సీలియాక్ జబ్బు ఉన్న వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. అయితే మొక్కజొన్న గింజలతో తయారు చేసే కొన్ని పదార్థాల్లో గ్లుటెన్ కలిపే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్యాకెట్ల మీద పోషక వివరాలను పరిశీలించటం ఉత్తమం.