Athimela ashok | పటాన్ చెరు, అక్టోబర్ 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల ఉరితాళ్లుగా మారుతున్నాయని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్ అన్నారు. గురువారం పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ లో జరిగిన సీఐటీయూ కార్యకర్తల సమావేశానికి అతిమేల మానిక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కార్మిక పోరాటాల సారథి సీఐటీయూ సంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలు అక్టోబర్ 19న సదాశివపేట పట్టణంలో విజయవంతంగా జరిగాయి. ఈ మహాసభల్లో జిల్లాలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగిందని అన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో 14 తీర్మానాలు చేసామని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ కార్మికులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని అన్నారు. కార్మికులకున్న చట్టాలను హక్కులను రద్దుచేసి లేబర్ కోడ్స్ గా మార్చి పెట్టబడుదారుల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమల్లో కనీస వేతనాలు గత 11 సంవత్సరాలుగా సవరించడం లేదని అన్నారు. ఈ కాలంలో 200 శాతం పైగా నిత్యవసర సరుకుల ధరలు పెరిగి కార్మికుల బ్రతుకులపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26,000 పెంచాలని సీఐటీయూ డిమాండ్ చేస్తుంది అని అన్నారు.
యాజమాన్యాలకు చుట్టాలుగా కార్మిక చట్టాలు..
జిల్లాలో సుమారు 1375 పరిశ్రమల్లో లక్ష 80 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని అందులో అత్యధికంగా లక్ష ఇరవై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. వీరికి కనీసవేతనాలు వీడీఏ ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, ఈఎల్స్, గ్రాట్యుటీ, యూనిఫామ్, షూ, క్యాంటీన్ ట్రాన్స్పోర్ట్ గుర్తింపు కార్డులు, పేస్లిప్పులు వంటి చట్టపరమైన సౌకర్యాలు ఎక్కడ అమలు కావడం లేదని అన్నారు.
కార్మికులకు చట్టాలు ఉన్నా యాజమాన్యాలకు చుట్టాలుగా మారుతున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులకు 12 గంటలు పనిచేస్తూ చట్టపరమైన సౌకర్యాలు కల్పించకుండా ఓటీ డబుల్ కట్టివ్వకుండా యాజమాన్యాలు తీవ్ర శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయని అన్నారు. సిగాచి ఘోర ప్రమాదం జరిగి నాలుగు నెలలు అవుతున్నా బాధిత కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందలేదని అన్నారు. తక్షణమే ఒకే విడతలో మిగతా 75 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులపై పని ప్రదేశాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులతో దినదిన గండంగా బతుకుతున్నారని అన్నారు.
మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సమానపనికి సమాన వేతనం, ప్రసూతి సెలవులు అమలు కావడం లేదని అన్నారు. స్కీమ్ వర్కర్లు, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం, ఎన్ఆర్ఎచ్ఎంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు వివిధ ప్రభుత్వ శాఖల్లో గత అనేక సంవత్సరాలు పనిచేస్తున్నా చట్టపరమైన సౌకర్యాలు అమలు కావడం లేదని, నెల నెల జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఏడు డిస్పెన్సరీలో సరిపోను డాక్టర్లు లేరు..
సంగారెడ్డి జిల్లాలో రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్, ఏడు డిస్పెన్సరీలో సరిపోను డాక్టర్లు లేరని, తీవ్రమైన మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మున్సిపల్ గ్రామపంచాయతీ మిషన్ భగీరథ కార్మికులకు నెలనెల జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భవన నిర్మాణం ట్రాన్స్పోర్ట్ హమాలి వంటి అసంఘటిత రంగ కార్మికుల సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల హక్కుల సాధన కోసం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.
సదాశివపేటలో జరిగిన సీఐటీయూ జిల్లా 4వ మహాసభలో 58 మందితో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నాం. 17 మందితో జిల్లా ఆఫీస్ బేరర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం నుండి సీఐటీయూ నూతన జిల్లా కమిటీ సభ్యులుగా శాంత కుమార్, సుధాకర్, రాజు ఎన్నికైనారని అన్నారు. ఈ సమావేశంలో పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ నాయకులు రాజు, సుధాకర్, వెంకటేష్, మహేశ్వర్ రెడ్డి, చంద్రయ్య, శ్రీనివాస్, రోషన్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
Grain purchase | రైతులు దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : హనుమంత్ రెడ్డి
CITU | కార్మికులకు అన్యాయం.. సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి : ఏ మల్లేశం