బంజారాహిల్స్( హైదరాబాద్ ) : కేసీఆర్ ( KCR ) హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించడంలో ఒక్కొక్క బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కొ కేసీఆర్‌లాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ( Niaranjan Reddy ) అన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ( Sunitha Gopinath ) కు మద్దతుగా మాజీ మంత్రి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో మాగంటి సునీతా విజయం సాధించడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా బీఆర్ఎస్కే తమ ఓటు అంటూ ఓటర్లు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నెలరోజులుగా ప్రతి గడపకు వెళ్లి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించడమే దీనికి కారణమన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్దిని, ఆయన అందించిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ గుర్తుచేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతలు బోర్ల భీమయ్య, విజయ్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, మాణిక్యం, ధర్మానాయక్, సునీల్ వాల్మీకి, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.