Deputy Collector Tejaswi | మునిపల్లి, సెప్టెంబర్ 28 : నిజ జీవితంలో కొంతమంది ఎవరికి నచ్చిన రంగంలో వారికి నచ్చే విధంగా వారికి ఇష్టం వచ్చిన రంగాల్లో ముందుకు దూసుకుపోతుంటారు. మరి కొంతమంది ఇష్టం ఉన్నా లేకున్నా తల్లిదండ్రుల నిర్ణయాలను గౌరవిస్తూ తల్లిదండ్రులకు నచ్చిన రంగాల్లో ముందుకు సాగిపోతుంటారు. మరి కొంతమంది అది కావాలి.. ఇది కావాలి అంటూ కలలు కంటుంటారు.
కొంతమంది మాత్రమే కంటున్న కలలను నిజం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో కన్న కలలను జీవితంలో నెరవేర్చేందుకు వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. కంటున్న కలలను నిజం చేసుకునేందుకు కొంత మంది మాత్రమే అనుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగుతూ కలలు నిజం చేసి తోటి ఆడబిడ్డలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మునిపల్లి మండలంలోని కంకల్ గ్రామానికి చెందిన మడపతి ప్రసన్న-సంగమేశ్ దంపతుల ఏకైక కూతురు తేజస్వి. తల్లిదండ్రులు తేజస్విని ఏం చదువుతా అంటే అది.. కూతురికి నచ్చిన విద్యను చదివించారు. ఈ రోజు తల్లిదండ్రుల ధైర్యం…భర్త ఆశీస్సులు.. అత్తమామల అండదండలతో తేజస్వి జనగాం డిప్యూటీ కలెక్టర్‌గా నియామకమైంది. కంకోల్ గ్రామానికి చెందిన ఓ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాల్లోకి వెళ్లడం మునిపల్లి మండలానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఆడబిడ్డపై మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామానికి చెందిన విద్యార్థి ఉన్నత చదువులు చదువుకొని డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక అవడం పట్ల గ్రామస్తులతో పాటు మండల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తేజస్విని ఆదర్శంగా తీసుకోవాలంటూ అభినందనలు తెలుపుతున్నారు.
ముందు నుంచే పట్టుదల..
మండలంలోని కంకోల్ గ్రామానికి చెందిన తేజస్వినికి విద్యా రంగంలో ముందు నుంచే పట్టుదల ఎక్కువ… విద్యారంగంలో అనుకుంటే సాధించేవరకు వదిలిపెట్టదు. 2020లోనే జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై నేటి వరకు ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఉన్నత చదువులు చదువుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు పోటి పరీక్షలకు సిద్ధమయ్యారు. అనుకున్న లక్ష్యం వైపు పరుగులు తీశారు…ఆడబిడ్డలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు అని గర్వంగా చెప్పుకునేందుకు తేజస్వి తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు.
డిప్యూటీ కలెక్టర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి : మునిపల్లి మాజీ ఎంపీపీ శైలేజ
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ జనగాం డిస్ట్రిక్ట్ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక కావడం చాలా సంతోషం. మండలంలోని విద్యార్థినులు మారుమూల గ్రామం కంకోల్ లో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన తేజస్విని మండలంలోని విద్యార్థినిలు ఆదర్శంగా తీసుకొని మరింత ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.గ్రామాల్లో తల్లిదండ్రులు ఆడబిడ్డ పుట్టగానే అరిష్టం అనుకుంటారు..ఆ ఆడబిడ్డ ఆ ఇంటి అదృష్టంగా భావించి పుట్టిన ప్రతి ఆడబిడ్డను చదివించి వారి జీవితాల్లో వెలుగులు తల్లిదండ్రులే నింపాలి. మండలంలోని ప్రజలు మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలను తప్పనిసరిగా ఉన్నత చదువులు చదివించాలి. అప్పుడు ఆడబిడ్డలకు సమాజంలో తగిన గుర్తింపు దక్కుతుంది.
వెలకట్టలేని ఆనందం : డిప్యూటీ కలెక్టర్ తేజస్వి తండ్రి సంగమేశ్
మా ఇంటి బిడ్డ ఉన్నత చదువులు చదువుకొని ప్రజలకు సేవ చేసేంత గొప్ప స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా కూతురు చదువుతా అన్నది మేము చదివించాం. గత నాలుగు సంవత్సరాల క్రితం మా బిడ్డకు వివాహం చేసాం.. అప్పటినుంచి మాతోపాటు మా అల్లుడు సైతం మా కూతురు చదువుకు సహకరించారు. మా కూతురు ఎల్లప్పుడూ చదువు చదువు అంటు చదువుని ఇష్టంగా చదివేది.. మూడోసారి ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైంది అందుకు చాలా సంతోషం.పండుగలు… దావత్ లు అంటూ చూడకుండా ఎప్పుడు పుస్తకాలు ముందే కూర్చునేది..ఆరోజు ఇష్టంగా చదివి నేడు డిప్యూటీ కలెక్టర్ ఎంపిక కావడం సంతోషం. పిల్లలు ఏం చదువుతా అంటే అది తల్లిదండ్రులు చదివించాలి.వారికి నచ్చిన చదువు చదివితేనే వారు అనుకున్న లక్ష్యం చేరుకుంటారు.
కుటుంబ సభ్యుల సహకారంతోనే డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన : తేజస్వి
కుటుంబ సభ్యుల సహకారంతోనే నేను అనుకున్న లక్ష్యం సాధించాను. నేను పెట్టుకున్న లక్ష్యం సాధిస్తానో లేదో అనుకున్న రోజుల్లోనే మా కుటుంబ సభ్యులు నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సాధిస్తావు బిడ్డ నీకు నచ్చింది చదువుకోని నీ వెనకాల మేమున్నామంటూ కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారు. కుటుంబ సభ్యుల ధైర్యంతోనే నేను అనుకున్న లక్ష్యం చేరుకున్నాను.. నేను డ్యూటీ కలెక్టర్‌ను అవుతానో లేదో నాకు తెలవదు కానీ నా కుటుంబ సభ్యులు నాపై పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ రోజు ఈ స్థాయికి చేర్చింది. మా అమ్మ నాన్న నన్ను చదివించేందుకు చాలా కష్టపడ్డారు.
మా అమ్మానాన్నలు కన్న కలలను నేను నెరవేర్చాలన్న పట్టుదలతో ముందుకు సాగుతూ అనుకున్న లక్ష్యం చేరుకున్నాను.. 2017లో సాప్ట్వేర్ ఉద్యోగం, 2020లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించాను. నా కూతురు పుట్టిన 15 రోజుల్లోనే పోటీ పరీక్ష ఉండడంతో పరీక్షకు హాజరయ్యాను. నేను అనుకున్న లక్ష్యం చేరుకోవడంలో నా భర్త, అమ్మానాన్న అత్త మామల సహకారం చాలా గొప్పది. రెండు మూడు రోజుల్లో జనగాం జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటాను. పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యలపై దృష్టి పెట్టి నిరుపేదల సమస్యల పరిష్కారంలో ముందుంటా.
ప్రతీ ఆడబిడ్డ చదువుకోవాలి : ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
అనుకున్న లక్ష్యం చేరుకోవడంలో ఆడబిడ్డలు ముందుంటారు.. ఇంట్లో ఉండే ప్రsw ఆడబిడ్డను తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించాలి. ఆందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి నేడు డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక కావడం చాలా సంతోషం. ఆడబిడ్డ కోరుకున్న చదువును చదువుకునేందుకు తల్లిదండ్రులు సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలోనే మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన తేజస్విని మండలంలోని ఆడబిడ్డలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.
MGBS | ప్రయాణికులకు శుభవార్త.. ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం