MGBS | హైదరాబాద్ : బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. మూసీకి వరద తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సులను ఎంజీబీఎస్ నుంచి పునరుద్ధరించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులను అధికారులు అందుబాటులో ఉంచారు. అంతర్ రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ఆర్టీసీ ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిటకిటలాడుతోంది.
శుక్రవారం రాత్రి భారీ వరద నేపథ్యంలో ఎంజీబీఎస్ నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్‌లో ఉన్న బస్సులను, ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, మెహిదీపట్నం వరకే జిల్లా సర్వీసులు రాకపోకలు కొనసాగించాయి.