Karur Stampede | తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ఈ ఘటన విచారకరమైందని, బాధాకరమైందన్నారు. దేశంలో క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణలో ఏదో తప్పు జరుగుతోందన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక సంఘటన జరుగుతుందని.. గతంలో బెంగళూరులో జరిగిన ఘటన కూడా మనకు గుర్తుకు వస్తుందన్నారు. ఈ తొక్కిసలాటల్లో పిల్లలు చనిపోతున్నారన్న వార్తలు వినడం చాలా విచారకరమన్నారు. సామాన్య ప్రజలను రక్షించేందుకు ఓ స్థిరమైన జాతీయ విధానాన్ని రూపొందించేందుకు మనం ఏం చేయగలం అన్నదే ప్రశ్న అని థరూర్ పేర్కొన్నారు. ప్రజలు రాజకీయ నాయకులు, సినీ నటులు, క్రికెటర్ల మాట వినేందుకు వెళ్తుంటారని.. ప్రాథమిక విషయం ఏంటంటే కొన్ని రూల్స్, ప్రమాణాలు, ప్రోటోకాల్స్ ఉండడం అవసరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద జనసమూహాన్ని నియంత్రించేందుకు చాలా కఠినమైన విధానాలను అవలంబించడానికి కేంద్ర, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలని కోరుతున్నానన్నారు.
\తద్వారా మనం ప్రియమైన వారిని కోల్పోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదని.. ఈ భయంకరమైన తొక్కిసలాటలతో బాధపడాల్సిన అవసరం లేదని థరూర్ పేర్కొన్నారు. ప్రపంచం మారుతోందని.. అనేక మార్పులు జరుగుతున్నాయన్నారు. నిరంతరం ప్రపంచ క్రమం గురించి మాత్రమే కాకుండా మనం ఎదుర్కొంటున్న ప్రపంచ గందరగోళం గురించి కూడా తాను మాట్లాడుతున్నానన్నారు. ఈ పరిస్థితులలో మనం చురుగ్గా ఉండాలని.. ఈ మార్పుల నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండాలని, వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉండాలని తాను నమ్ముతున్నానన్నారు. తాను మల్టి పోలార్ కాన్సెప్ట్‌ని నమ్ముతానని.. తద్వారా మన తలుపులు అందరికీ తెరిచి ఉంటాయని.. అది అమెరికా, చైనా మనం ఏ ఒక్క దేశం ప్రభావానికి లోనుకామన్నారు. ఇతరుల ఏకపక్ష నిర్ణయాలకు బాధితులయ్యేంత బలహీనంగా మారకూడదని.. అందువల్ల బలం, ధైర్యం, సొంతకాళ్లపై దృఢంగా నిలబడే సామర్థ్యం ఉండాలన్నారు.