Farmer Letter | ఝరాసంగం, ఏప్రిల్ 22 : ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్నామని చెబుతున్న తరుణంలో, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలానికి చెందిన కిశోర్ బాబు (77) అనే వృద్ధ రైతు, విద్యుత్ కోతలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ-మెయిల్ చేశారు.
గత 18 నెలల్లో తన విద్యుత్ మోటారు ఆరుసార్లు కాలిపోవడంతో, దానిని బాగు చేయించడానికి దాదాపు రూ. 40 వేల ఖర్చు చేయాల్సి వచ్చిందని, వోల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా తన బోరుబావి పంపుసెట్లు పదేపదే కాలిపోతున్నాయని రైతు పేర్కొన్నారు. ఝరాసంగం మండలంలోని పలు గ్రామాల్లో తరచూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని, స్థానిక ఏఈ (ట్రాన్స్కో) సరళకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. ప్రమాదకరమైన విద్యుత్ తీగలు తన వ్యవసాయ క్షేత్రంలో కేవలం 6 అడుగుల ఎత్తులో వేలాడుతున్నాయని, దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు ఏఈకి విన్నవించినా స్పందించడం లేదని ఆరోపించారు.
బీహెచ్ఈఎల్ (BHEL)లో పదవీ విరమణ చేసిన కిశోర్ బాబు, వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈదులపల్లిలో ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆపిల్, డ్రాగన్ ఫ్రూట్, పలు రకాల మామిడి తోటలను సాగు చేస్తున్నారు. అయితే తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలకు నీరు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు డజన్ల కొద్దీ ఈ-మెయిల్స్ పంపినా, వ్యక్తిగతంగా పలుమార్లు విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశానని రైతు తెలిపారు.
విద్యుత్ సమస్యలు ఇలాగే కొనసాగితే తాను వ్యవసాయాన్ని వదిలేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలోని రైతులందరూ ఇదే సమస్యతో సతమతమవుతున్నారని, తక్షణమే నాణ్యమైన విద్యుత్ అందించేలా, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని ముఖ్యమంత్రిని కోరారు.

Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే!