హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కార్‌ను మొద్దునిద్ర నుంచి తట్టిలేపడానికి తామంతా శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు వాహన, డెలివరీ సంఘాల జేఏసీ ప్రకటించింది. వాహన సేవలు, యాప్ ఆధారిత డెలివరీ సేవలు నిలిపివేస్తామని జేఏసీ వెల్లడించింది. ఆటో, క్యాబ్, లారీ తదితర వాహన సేవలు, ఓలా, ర్యాపిడో, ఉబర్ ఆధారిత సేవలు, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ తదితర డెలివరీ సేవలు అన్నీ బంద్ చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. నాంపల్లిలోని ‘గిగ్’ కార్యాలయంలో గురువారం 16 సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్ని సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు చాలాసార్లు తమ సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటి సమావేశం నాంపల్లి గ్రౌండ్లో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన సేవల యాప్ తీసుకొస్తామని మాటిచ్చి ఇప్పుడు ముఖం చాటేశారని వాహన సంఘాల జేఏసీ అధ్యక్షుడు షేక్ సలాఉద్దీన్, ఉపాధ్యక్షుడు, బీఆర్టీయూ నాయకుడు నగేశ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్నా ‘గిగ్’ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం దారణమని మండిపడ్డారు. జూలై 22న నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బ్రేక్‌డౌన్ ఫ్లాష్ సమ్మె సుమారు 3.3 లక్షల మంది పాల్గొన్నారని చెప్పారు. కార్మికులకు తగ్గుతున్న ఆదాయం, అన్యాయమైన చార్జీల విధానం, అల్గారిథమ్ ఆధారిత ఏకపక్ష నియంత్రణ, సామాజిక భద్రత లేకపోవడం వంటి తీవ్రమైన సమస్యలను ఎదురొంటున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ నిరవధిక సమ్మెలో తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారం వరర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, తెలంగాణ రాజ్య సమితి ట్రేడ్ యూనియన్, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఫెడరేషన్, ఇండియన్ లేబర్ వెల్ఫేర్ ఫెడరేషన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వరర్స్, తెలంగాణ మైనారిటీస్ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ తదితర కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థలు సమ్మెలో పాల్గొననున్నాయి.
యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం, ప్లాట్ఫారం కంపెనీలు కలిసి కనీస బేస్ఫేర్తోపాటు ప్రతి కిలోమీటరుకూ, ప్రతి నిమిషానికీ న్యాయమైన చార్జీలను నోటిఫై చేయాలి. తద్వారా యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ వరర్లు, అన్ని గిగ్, ప్లాట్ఫారం కార్మికులకు స్థిరమైన ఆదాయం లభించేలా చూడాలి. తెలంగాణ గిగ్, ప్లాట్ఫారం వరర్స్ రూల్స్‌ను వెంటనే నోటిఫై చేసి, వెల్ఫేర్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలి. మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు- 2025ను పూర్తిగా అమలు చేసి, ప్రభుత్వం నిర్ణయించిన కనీస చార్జీలను నోటిఫై చేయాలి. మోటర్ వెహికల్స్ చట్టం-1988, మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు- 2025 ప్రకారం కమర్షియల్ రిజిస్ట్రేషన్‌ను మార్చకుండా ప్రైవేట్ (నాన్-కమర్షియల్) ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు ఉపయోగించడాన్ని నిషేధించాలి.