హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 18: ఆర్టీసీలో ఎన్నికల నగారా మోగింది. సుమారు ఎనిమిదేళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం(యూనియన్) ఎన్నికలకు ఎట్టకేలకు ఆర్టీసీ యాజమాన్యం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర కార్మిక శాఖ అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 9న పోలింగ్, 17న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లో ఎన్నికల వేడి మొదలైంది.
ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. అక్టోబర్ 9న ఓటింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు పూర్తిచేసి విజేతలను ప్రకటించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. దాంతో.. వరంగల్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో(హనుమకొండ, వరంగల్-1, వరంగల్-2, నర్సంపేట, పరకాల, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, తొరూరు) యూనియన్ల సందడి, ప్రచారం ముమ్మరమైంది. చివరిసారిగా ఆర్టీసీలో 2018లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి.
ఇప్పుడు 2026 గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ముందుగా గుర్తింపు కార్మిక సంఘం కోసం ఎన్నికలు జరిపి.. అనంతరం ప్రభుత్వంలో విలీనం చేపడతామని ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియ నేపథ్యంలో ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు అత్యంత కీలకంగా మారడంతో సంఘాల మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది.
ఆర్టీసీ సంస్థలో పలు కార్మిక సంఘాలు, యూనియన్లు ఉన్నాయి. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన సంఘాలనే చట్టబద్ధమైన గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. ఈ ఎన్నికలను ప్రాంతీయ, రాష్ట్రస్థాయిల్లో వేర్వేరుగా నిర్వహిస్తారు. ఈ రెండు స్థాయిలకు సంబంధించి ఓటర్లకు వేర్వేరు బ్యాలెట్ పత్రాలను అందిస్తారు. కార్మికుల హక్కుల రక్షణలో గుర్తింపు సంఘానిదే ప్రధాన పాత్ర. ఆర్టీసీ కార్మికుల వేతనాల పెంపు, సీఆర్‌తో పాటు జీతాల సవరణ, బోనస్‌లు, కరువు భత్యం(డీఏలు), పెండింగ్ బకాయిలు, సర్వీసు నిబంధనలలో మార్పులు, డిపోల పనివేళలు వంటి అత్యంత కీలకమైన సంఘానికి నేరుగా ఆర్టీసీ యాజమాన్యంతో, ప్రభుత్వంతో అధికారిక చర్చలు జరిపే ఏకైక చట్టబద్ధమైన హక్కు ఈ యూనియన్‌కే దక్కుతుంది.
కార్మికుల సంక్షేమానికి సంబంధించి యాజమాన్యంతో చట్టబద్ధ ఒప్పందాలు చేసుకోవడంలోనూ గుర్తింపు సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టీసీలో పనిచేసే వరంగల్ రీజియన్‌స్థాయి అధికారి హోదా మినహా మిగిలిన కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు, కార్మికులందరూ ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కల్పించారు. సుధీర్ఘకాలం తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆర్టీసీ డిపోల్లో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. కార్మిక సంఘాలు కూడా తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ రావడంతో కార్మిక సంఘాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే డిపోల వారీగా ప్రచారం కూడా ముమ్మరం చేశాయి. గెలిచిన సంఘాన్ని ప్రభుత్వంలో విలీనానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో భాగస్వామ్యం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంతో గెలుపు కోసం కార్మిక సంఘాలు కష్టపడుతున్నాయి. డిసెంబర్ 9న విలీన ప్రక్రియపై తుది ప్రకటన చేసే అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సంకేతాలు అందినట్లు సమాచారం. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఏప్రిల్ నెలలో సమ్మె చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం సహా యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టారు. కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు సహా విలీనంపై ఫోకస్ పెట్టారు.
వరంగల్ రీజియన్‌లో క్రియాశీలకంగా ఉన్న ప్రధాన ఆర్టీసీ యూనియన్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ), ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్), బజన మోటార్ కార్మిక సంఘం(బీఎంకేఎస్) అండ్ ఇతర చిన్న సంఘాలు ఉన్నాయి. వరంగల్ ఆర్టీసీ జేఏసీ(జాయింట్ యాక్షన్ కమిటీ) వరంగల్ పరిధిలోని ఈ ప్రధాన యూనియన్లన్నీ కలిసి ఆర్టీసీ జేఏసీగా ఏర్పడ్డాయి. వరంగల్ రీజియన్‌కు యాక స్వామి జేఏసీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌లో నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య అనంతరం ఈ జేఏసీ ఆధ్వర్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున సమ్మె, బంద్, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయడం. ఉద్యోగులను పూర్తిస్థాయి ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించడం. 2017, 2021 వేతన సవరణ(పీఆర్సీ) బకాయిలను వెంటనే విడుదల చేయడం. మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం(మహాలక్ష్మీ పథకం) ప్రవేశపెట్టిన తర్వాత పెరిగిన పని భారానికి సమానంగా సిబ్బందిని నియమించడం, పని ఒత్తిడిని తగ్గించడం.