KTR : పేదల ఖాతాల్లో లక్ష కోట్లు వేస్తామంటే తమ పేరిట ఉన్న ఇంచు భూమిని కూడా రాసిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ కుటుంబానికి లక్ష కోట్ల భూములు ఉన్నాయంటూ సీఎం చేసిన ఆరోపణలపై సవాల్ విసిరిన కేటీఆర్ పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆయన అడ్డగోలు ఆరోపనణలు చేస్తున్నారని ఎక్స్ పోస్ట్‌లో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ రాసిస్తామని, రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘‘సీఎం రేవంత్.. నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్ ఇస్తున్నా. మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విష ప్రచారంపై నీకు ఓ సవాల్ విసురుతున్నా. మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం.. రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణలోని పేద ప్రజల ఖాతాల్లో వెంటనే రూ.లక్ష కోట్లు వేస్తానంటే తమ పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని ఉన్నపళంగా రాసిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పేదల ఖాతాల్లో లక్ష కోట్ల రూపాయలు వేసేంత ధైర్యం లేకుంటే తనపై చేస్తున్న ప్రచారాన్ని ఇకనైనా ఆపి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘నీ పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు’’ అని అన్నారు.
కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ఇంతకాలం చేసిన ప్రచారం బెడిసికొట్టడంతో ఇప్పుడు లక్ష కోట్ల భూములంటూ రేవంత్ రెడ్డి కొత్త ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది 67 ఎకరాలు మాత్రమేనని రేవంత్ రెడ్డే అసెంబ్లీలో స్వయంగా అంగీకరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తు చేశారు. అలాంటప్పుడు మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతున్నారని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు విషయంలో జరిగిన మోసాల నుంచి, 22ఏ భూముల అంశం నుంచి నాలుగు కోట్ల మంది ప్రజల దృష్టిని ఇలాంటి ఆరోపణలతో మళ్లించలేరని ఆయన స్పష్టం చేశారు.

‘‘నువ్వు చేసిన ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదు. అందులో అసత్యాల వరద, అబద్ధాల బురద తప్ప ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు?’’ అని సీఎంను సూటిగా కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఇలాగే దుష్ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ మరోసారి ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్ముతారని భావించడం సరికాదని ముఖ్యమంత్రికి ఆయన హితవు పలికారు.
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు, యూరియా సంక్షోభం, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంపై సీఎం బురదజల్లడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, వెయ్యి రోజులు గడిచినా పది శాతం ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. తన పాలనా వైఫల్యాలను ఇలాంటి ప్రచారంతో కప్పిపుచ్చలేరని ఆయన పేర్కొన్నారు.

పవిత్రమైన అసెంబ్లీలో అసత్యాలు, అభూత కల్పనలతో మాట్లాడి చట్టసభ గౌరవానికి రేవంత్ రెడ్డి భంగం కలిగించారని కేటీఆర్ ఆరోపించారు. ఇది క్షమించరాని విషయమని పేర్కొన ఆయన.. 22ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుకే సీఎం చెబుతున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. అక్రమ దందాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చారని రేవంత్ రెడ్డిని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప ఆయనకు పరిపాలన చేతకాదని ప్రజలకు అర్థమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఏర్పడగానే కాంగ్రెస్ ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలు, కుంభకోణాలన్నింటినీ బయటపెడతామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజల సాక్షిగా దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు.
సీఎం రేవంత్..
నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కశాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్ ఇస్తున్నా..
మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై.. నీకు ఓ సవాల్ విసురుతున్నా..
మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం… రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు…
— KTR (@KTRBRS) September 18, 2026