Ponguleti Srinivasa Reddy | ఖమ్మం రూరల్, ఆగస్టు 7: ఖమ్మం జిల్లా ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎదుట స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కాలనీ ఏర్పడి దాదాపు 18 ఏళ్లు గడిచినా కనీస మౌలిక వసతులు కల్పించలేదని, పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పు లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కాలనీలో సైడ్ డ్రైనేజీలు లేక వర్షాకాలంలో నీరు నిలిచిపోతోందని, అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయని, ప్రాథమిక సౌకర్యాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత అభివృద్ధి పనులు వేగం అందుకుంటాయని ఆశించినా ఆశలు నెరవేరలేదని పేర్కొన్నారు.
గతంలో ఇదే కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయని కాలనీవాసులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించినా సమస్యలు యథాతథంగానే ఉన్నాయని వాపోయారు.
వర్షంలోనే కాలనీలో పర్యటించిన మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, మున్సిపల్ చైర్పర్సన్ పి. అనిత, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పలు వీధులను పరిశీలించారు. ఇంటి ముందుకు వచ్చిన ప్రజలు నేరుగా మంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించారు.
కాలనీ సమస్యలపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో మరోసారి ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈసారి అయినా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉందని కాలనీవాసులు పేర్కొంటున్నారు.