Tourette Syndrome | టూరెట్ సిండ్రోమ్ ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో తమకు వచ్చే అసంకల్పిత కదలికలు, శబ్దాలను కొంతకాలం అదుపులో ఉంచగలిగినప్పటికీ, అందుకోసం వారు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో కనిపించే టిక్స్ అంటే పదేపదే జరిగే కదలికలు లేదా శబ్దాలు. ఇవి వ్యక్తి పూర్తిగా తన ఇష్టంతో చేసే చర్యలు కావు. కొంతసేపు వాటిని అణచివేసిన తర్వాత ఇంటికి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే బయట ప్రశాంతంగా కనిపిస్తున్నారని ఆ వ్యక్తికి టూరెట్ సిండ్రోమ్ లేదని భావించడం సరైంది కాదు.
టూరెట్ సిండ్రోమ్ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండవు. కొందరిలో కళ్లను పదేపదే మూయడం, భుజాలు ఎగరేయడం, ముఖ కదలికలు వంటి కదలికలు కనిపిస్తే, మరికొందరిలో అనేక కండరాలు కలిసి పనిచేసే సంక్లిష్ట కదలికలు కనిపిస్తాయి. గొంతు సరిచేసుకోవడం, ముక్కు పీల్చడం, పదాలు లేదా శబ్దాలను పునరావృతం చేయడం వంటి శబ్ద సంబంధమైన టిక్స్ కూడా ఉంటాయి. ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యం వంటి పరిస్థితులతో టిక్స్ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే సంగీతం వాయించడం, క్రీడలు ఆడడం వంటి పనుల్లో పూర్తిగా నిమగ్నమైనప్పుడు కొందరిలో టిక్స్ తక్కువగా కనిపిస్తాయి.
ఈ లక్షణాలను అణచివేయడం సాధ్యమైనప్పటికీ అది సులభమైన ప్రక్రియ కాదు. టిక్స్ వచ్చే ముందు గొంతులో ఏదో పేరుకుపోతున్నట్లుగా లేదా ప్రత్యేకమైన ఒత్తిడి అనిపిస్తుంది. ప్రవర్తనా చికిత్స ద్వారా ఇలాంటి ముందస్తు సంకేతాలను గుర్తించడం, టిక్స్ ఎప్పుడు ఎక్కువగా వస్తాయో తెలుసుకోవడం, వాటికి బదులుగా మరో స్పందనను ఉపయోగించడం నేర్పిస్తారు. ఉదాహరణకు గొంతు సరిచేసుకునే టిక్ వచ్చే ముందు నెమ్మదిగా ముక్కుతో శ్వాస తీసుకోవడం, నోరు మూసి ఉంచడం వంటి పద్ధతులు ఉపయోగించవచ్చు. ఇలా శరీరంలోని సహజమైన స్వీయ నియంత్రణ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా టిక్స్ తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు.
టూరెట్ సిండ్రోమ్ కారణం పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా, జన్యుపరమైన, పర్యావరణ అంశాలు దాని అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఒక శాతానికి లోపే ఈ పరిస్థితి కనిపిస్తుందని అంచనాలు చెబుతున్నాయి. టూరెట్ సిండ్రోమ్ ఉన్నవారిలో ఆందోళన, ఏకాగ్రత సమస్యలు, బలవంతపు ఆలోచనలు వంటి ఇతర సమస్యలు కూడా ఉంటాయి. ఇవి కొన్నిసార్లు టిక్స్ కంటే వారి చదువు, స్నేహాలు, రోజువారీ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. టిక్స్ను కొంతకాలం నియంత్రించగలరనే కారణంతో వారిని నటిస్తున్నారని లేదా సమస్యను కావాలనే చేస్తున్నారని భావించకూడదు. ఈ పరిస్థితిపై అవగాహన పెంచడం ద్వారా అపోహలు, సామాజిక వివక్ష తగ్గించడంతోపాటు, అవసరమైన వారికి సరైన చికిత్స అందేలా ప్రోత్సహించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.