నేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నరాలను పోగులుగా, తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కలను చీరలుగా మలిచి, మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
మగ్గాలతో అద్భుతాలు సృష్టించగలిగే సత్తా గల మన నేతన్నలు, సమైక్య పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.. అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసే అంత నైపుణ్యమున్న తెలంగాణ నేత కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని కేటీఆర్ గుర్తుచేశారు. వినూత్న పథకాలు, వివిధ కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులు తిరిగి తెలంగాణకు వచ్చేలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలతో నేతన్నల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. నేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటుందని తెలిపారు.