నిర్వహణ నిల్!
ప్రైవేట్ ఎస్టీపీల పనితీరుపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చేసిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. గేటెడ్ కమ్యూనిటీలు, ప్రైవేట్ ప్రాజెక్టులు నీటిని శుద్ధి చేయడకుండానే జలవనరుల్లోకి వదులుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
- సిటీలో నామమాత్రంగా 231 ప్రైవేట్ ఎస్టీపీల పనితీరు
- 237 ఎస్టీపీల్లో 6 మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తింపు
- శుద్ధి చేయకుండానే మురుగు బయటకు వదులుతున్న వైనం
- ప్రమాదకరస్థాయికి నగరంలోని జలవనరుల నీటి నాణ్యత
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఎస్టీపీల పనితీరుపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చేసిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. గేటెడ్ కమ్యూనిటీలు, ప్రైవేట్ ప్రాజెక్టులు నీటిని శుద్ధి చేయడకుండానే జలవనరుల్లోకి వదులుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అన్ని జలవనరుల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం నీటి నాణ్యత అత్యంత దిగువ స్థాయికి చేరినట్లు తేలింది. సిటీలోని ప్రధాన ప్రైవేట్ నిర్మాణ .. ప్రాజెక్టులకు సంబంధించిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీలు) నిర్వహణలో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని తేలింది.
చెరువులను కాలుష్యం నుంచి కాపాడటంతో పాటు, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పీసీబీ నగరవ్యాప్తంగా ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న 237 క్యాప్టివ్ ఎస్టీపీలను రోలింగ్ టాస్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేసి శుద్ధి చేసిన నీటి నమూనాలను సేకరించి.. ల్యాబ్‌లో విశ్లేషించారు. ఈ పరీక్షల్లో కేవలం 6 ఎస్టీపీలు మాత్రమే నిబంధనల ప్రకారం పనిచేస్తున్నట్లు తేలింది. తొమ్మిది ఎస్టీపీలు పూర్తిగా పనిచేయడం లేదని (నాన్-ఫంక్షనల్) గుర్తించారు.
మిగిలిన 222 ఎస్టీపీలు పనిచేస్తున్నప్పటికీ, నిర్దేశిత ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. ఆయా ప్లాంట్ల నిర్వహణలో లోపాల కారణంగా, వాటి నుంచి విడుదలవుతున్న శుద్ధి చేసిన నీటిలో కాలుష్య కారకాల స్థాయులు పీసీబీ ప్రమాణాల ప్రకారం లేవని స్పష్టమైంది. ఈనేపథ్యంలో నిబంధనల ఉల్లంఘన, నీటి కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టకపోవడంపై ఆయా ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
జలవనరుల నీటి నాణ్యతలో క్షీణత
నేషనల్ వాటర్ మానిటరింగ్ ప్రోగ్రాం కింద ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో హైదరాబాద్‌లోని పలు చెరువుల నీటి నాణ్యత క్షీణించినట్లు వెల్లడైంది. ఈ జలవనరుల నీటి నాణ్యత సీపీసీబీ నిర్దేశించిన కేటగిరీల్లో కింది స్థాయి అయిన ‘క్లాస్-ఈ’ స్థాయికి పడిపోయినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఈ నీటిని సాగునీటి అవసరాలు, పారిశ్రామిక శీతలీకరణ, నియంత్రిత వ్యర్థాల విడుదల వంటి నిర్దిష్ట అవసరాలకు మాత్రమే వినియోగించవచ్చని పరీక్షల్లో తేలింది. పర్యావరణ నిబంధనల ప్రకారం, 20 వేల చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎకువ నిర్మిత విస్తీర్ణం కలిగిన అన్ని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య ప్రాజెక్టులు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి స్థాపనా అనుమతి, నిర్వహణా అనుమతి పొందడం తప్పనిసరి.
ఆయా ప్రాజెక్టుల నిర్వాహకులు తాము ఏర్పాటు చేసుకున్న ఎస్టీపీలను నిర్దేశిత మురుగునీటి విడుదల ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలి. అంతేకాకుండా, ప్రత్యేక ఫ్లో మీటర్లు, విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి, రోజువారీ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా నమోదు చేసి భద్రపరచాల్సి ఉంటుంది. కానీ సిటీ వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిబంధనలు పాటించడం లేదని తేలింది. నిర్మాణ ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలు తమ ఎస్టీపీలను నిరంతరాయంగా, సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రోజువారీ నిర్వహణ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచాలని సూచించారు. నిబంధనలను పాటించని వారిపై నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం, 1974 నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

