పాడ్ కార్లపై భిన్న స్వరాలు!
- కారిడార్ రద్దీకి సరిపోయే ప్రణాళికలు అవసరం
- మెట్రో రైలు విస్తరణ అత్యవసరమంటున్న నెటిజన్లు
సిటీబ్యూరో, నవంబర్ 29(నమస్తే తెలంగాణ) : వెస్ట్ సిటీలోని ఐటీ కారిడార్లలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు ప్రతిపాదించిన పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(పాడ్ కార్లు)పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అత్యాధునిక సాంకేతికతతో కూడిన వేగవంతమైన రవాణా వ్యవస్థగా కొందరు దీనిని సమర్థిస్తుండగా, లక్షలాది మంది ప్రయాణించే ఐటీ హబ్‌కు ఇది ఏమాత్రం సరిపోదని మెజార్టీ నిపుణులు, నెటిజన్లు గళం విప్పుతున్నారు.
పాడ్ కార్ల ప్రతిపాదనను సమర్థించే వర్గం దీనిని మెట్రోకు పోటీగా కాకుండా, ఒక అనుబంధ వ్యవస్థగా మాత్రమే చూసే పరిస్థితి వచ్చింది. వేగవంతమైన ప్రయాణానికి ట్రాఫిక్ సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడిచే పాడ్ కార్ల వల్ల, మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఐటీ క్యాంపస్‌లకు వెళ్లడం సులభమవుతుందని అంటున్నారు. కానీ నిర్మాణ వ్యయం, సమయం అత్యంత ప్రధాన పాత్రను పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు. భారీ మెట్రో పిల్లర్ల నిర్మాణంతో పోలిస్తే పీఆర్టీఎస్ ట్రాక్ ల నిర్మాణ ఖర్చు ఎంత అనేది, ఎప్పటిలోగా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించగలదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో పట్టణ రవాణా నిపుణుల్లో ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ కారిడార్ వాస్తవ పరిస్థితులకు ఈ వ్యవస్థ సరిపడదని వారు స్పష్టం చేస్తున్నారు. సామర్థ్యంపై సందేహాలు ఉండగా, హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో భవిష్యత్తులో మరో 150 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి రానుంది. ఒక మెట్రో రైలు ఒకేసారి దాదాపు 1,500 నుంచి 2,000 మందిని తరలిస్తే, ఒక పాడ్ కారులో కేవలం 4 నుంచి 6 మంది మాత్రమే ప్రయాణించగలరు.
పీక్ అవర్స్‌లో వేలాది మంది ఉద్యోగులను తరలించడం పాడ్ కార్ల వల్ల అసాధ్యమని విమర్శిస్తున్నారు. విదేశాల్లో పర్యాటక ప్రాంతాలు, విమానాశ్రయాల్లోని టెర్మినళ్ల మధ్య అనుసంధానానికి మాత్రమే పాడ్ కార్లను వాడుతున్నారని, శంషాబాద్ ఎయిర్ పోర్టులో టెర్మినల్ -1, టెర్మినల్ -2, మెట్రో స్టేషన్ మధ్య ఏర్పాటు చేస్తే బాగుంటుంది కానీ, జన సాంద్రత ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్లకు ఇది పనికిరాదని తేల్చి చెబుతున్నారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలనే డిమాండ్
పాడ్ కార్ల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే భారీ రవాణా వ్యవస్థల వైపు ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మెట్రో ఫేజ్ -2కు ప్రాధాన్యతనివ్వాలని, మెట్రో విస్తరణలో వెస్ట్ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్లకు పెద్దపీట వేయాలని, మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు నేరుగా సైవాక్ నిర్మించాలని సూచిస్తున్నారు.
అదే విధంగా మోనోరైలు, ఈ-బైక్ లు వంటి సౌకర్యాలను అన్వేషించాలని చెబుతున్నారు. మెట్రోతో పాటు 3 నుంచి 6 కోచ్‌లతో కూడిన మోనోరైలు వ్యవస్థను సాంకేతికంగా పరిశీలించాలని, చివరి మైలు కనెక్టివిటీ కోసం ఈ-బైక్ లు, ఎలక్ట్రిక్ ఫీడర్ బస్సులను పెంచాలని అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వానికే స్పష్టత లేదు..
మెట్రో ఫేజ్ -2 పనులు పూర్తయ్యే వరకు తాతాలిక ఏర్పాటుగా పీఆర్‌టీఎస్‌ను తెస్తున్నారా, లేక మెట్రోకు ప్రత్యామ్నాయంగానే దీనిని భావిస్తున్నారా అనే దానిపై ప్రభుత్వం వద్దనే స్పష్టత లేదు. భిన్నస్వరాల నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని, కేవలం ఏజెన్సీలు ఇచ్చే సలహాలు, సూచనల కంటే… నిపుణుల సూచనలు, స్థానిక అవసరాలు, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే వ్యవస్థలో పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేస్తూ హైదరాబాద్ రవాణా ప్రణాళికను ఖరారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

