Srinu Vaitla | సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటైన ‘దూకుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రం రీ-రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు శ్రీను వైట్ల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దూకుడు సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం మహేష్ బాబే. ఆయన లేకపోతే ఈ సినిమా ఆ స్థాయిలో ఉండేది కాదు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఇది సంచలనం సృష్టిస్తుందని నాకు బలమైన నమ్మకం కలిగింది. అదే నమ్మకంతో సినిమాలో ‘ఆల్ టైమ్ రికార్డ్’ అనే డైలాగ్ కూడా పెట్టాను. చివరికి అది నిజమైంది అని తెలిపారు.
అప్పట్లోనే ఈ చిత్రం ఓవర్సీస్లో 2.4 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం కూడా ప్రత్యేకమని ఆయన గుర్తు చేశారు. మహేష్ బాబుతో తనకు అద్భుతమైన అనుబంధం ఉందని శ్రీను వైట్ల చెప్పారు. “మా ఇద్దరి మధ్య మంచి వేవ్‌లెంగ్త్ ఉండేది. నేను చెప్పే విషయాన్ని మహేష్ వెంటనే అర్థం చేసుకునేవారు. ఇస్తాంబుల్‌లో ఫస్ట్ షెడ్యూల్ సమయంలో ‘మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా’ అనే డైలాగ్ వినిపించగా ఆయన చాలా బాగుందని చెప్పారు. అప్పటి నుంచి మరిన్ని పంచ్ డైలాగులు, వన్లైనర్లు రాయాలనే ఉత్సాహం పెరిగింది. మహేష్ చెప్పే డైలాగ్ డెలివరీ నాకు మరింత ఎనర్జీ ఇచ్చేది” అని అన్నారు. సినిమా మొత్తం 140 రోజుల్లో పూర్తయిందని, అందులో టాకీ పార్ట్‌ను కేవలం 42 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు.
ఇస్తాంబుల్‌లో జరిగిన షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంఘటనలను కూడా శ్రీను వైట్ల పంచుకున్నారు. అక్కడి ట్రాఫిక్ కారణంగా షూటింగ్ ముగిసిన తర్వాత హోటల్‌కు చేరుకోవడానికి ఐదు గంటల సమయం పట్టేదని, అప్పుడు లోకల్ ట్రైన్లో వెళ్దామని మహేష్ సూచించడంతో కేవలం గంటలోనే హోటల్‌కు చేరుకునేవాళ్లమని చెప్పారు. అదే సమయంలో తాము బస చేసిన హోటల్లో భూకంపం రావడం, అందరూ భయంతో బయటకు పరుగులు తీయడం వంటి సంఘటనలు ఇప్పటికీ గుర్తున్నాయని అన్నారు. అలాగే సమంత షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు సమీపంలోనే బాంబు పేలుడు జరగడం, షూటింగ్ ముగిసిన రోజు పాస్‌పోర్టులు ఉన్న బ్యాగ్ క్యాబ్‌లో మరిచిపోవడం వంటి ఉత్కంఠభరిత సంఘటనలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.చివరగా క్యాబ్ డ్రైవర్ నిజాయితీగా బ్యాగ్‌ను తిరిగి తీసుకొచ్చాడని, ఆనందంతో నిర్మాత తన వద్ద ఉన్న డబ్బంతా అతనికి బహుమతిగా ఇచ్చారని శ్రీను వైట్ల తెలిపారు. మొత్తానికి ‘దూకుడు’ రీ-రిలీజ్ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన ఈ విశేషాలు అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.