Rajiv Yuva Vikasam | జహీరాబాద్, జూన్ 18 : ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో మోసం బయటపడిందని, రాజీవ్ వికాసం పథకాన్ని అమలు చేయకుండానే బుట్టలో పడేసి నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారని జహీరాబాద్ పట్టణ మాజీ కౌన్సిలర్, సీనియర్ నేత నామ రవికిరణ్ ఆరోపించారు.
బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నామ రవి కిరణ్ మాట్లాడుతూ.. ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీల వలె విజయవంతంగా చెత్త బుట్టలోకి చేరిపోయిందని ఈ పథకం అమలు విధానంపై పునరాలోచన చేస్తాం’ అని రాష్ట్ర క్యాబినెట్ తెలంగాణ యువతపై ఓ పిడుగును పడేసిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తారీఖున రెండు లక్షల మంది అబ్ధిదారులను ప్రకటించి.. పథకం మంజూరు పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వట్టి మాటలు అయ్యాయన్నారు.
రేవంత్ చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మిన తెలంగాణ యువత సుమారు 16 లక్షల మంది ఈ పథకానికి నమోదు చేసుకున్నారని, నమోదు చేసుకోవడానికి ప్రతి ఒక్క యువకుడికి సుమారు 200 నుంచి 300 రూపాయల వరకు ఖర్చు అయిందని అన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఆదాయం కలిగిందని అన్నారు. నమ్మిన యువకులకు కాంగ్రెస్ తన హామీలను పక్కనబెట్టడం ఇదే తొలిసారి కాదు.
రెచ్చగొట్టి ధర్నాలు చేయించిన కాంగ్రెస్..
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు చేయించిన కాంగ్రెస్, తాను అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెలువరించిన ఉద్యోగాలకు రేవంత్ ప్రభుత్వం జాయినింగ్ లెటర్లు ఇచ్చి తొలి ఏడాదిలోనే 58 వేల ఉద్యోగాలిచ్చామని ప్రగల్భాలు పలుకుతుందని విమర్శించారు.
కాంగ్రెస్ చేస్తున్న ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎంతో ఆర్భాటంతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఉద్యోగాల కల్పన అటుంచితే కనీసం స్వయం ఉపాధికి కార్పొరేషన్ రుణాలు తీసుకుందామన్నా యువతను మోసగాళ్లుగా చిత్రించి కాంగ్రెస్ ఆ పథకాన్ని కూడా ఆపేయడం ఆక్షేపణీయం అన్నారు. ఎంతో తెలివితో ఆలోచించే తెలంగాణ యువత ఇప్పటికైనా కాంగ్రెస్ కపట నాటకాలను గుర్తించాలని. ‘ఒడ్డెక్కే దాన్క ఓడ మల్లన్న ఒడ్డు దాటినాక బోడ మల్లన్న’ అనే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్