నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24 : నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలోని జాతరలో జరిగిన ఘటనలో చిన్నారి మృతి చెందడంపై రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రెండు నెలల చిన్నారి చనిపోయి అంత్యక్రియలు నిర్వహించిన చోటుకు కమిషన్ సభ్యులతో కలిసి వెళ్లి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. మంగళవారం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, కమిషన్ సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మిలతో కలిసి మల్లికార్జునస్వామి ఆలయం పరిసరాలను సందర్శించి వివరాలను తెలుసుకున్నారు.
హోంగార్డు చిత్రీకరించిన వీడియోలను డీఎస్పీ శ్రీనివాసులు వీడియోను ఫోన్లో చూపించారు. చిన్నారి తల్లిదండ్రులైన గణేశ్, మౌనికల ఇంటిని పరిశీలించారు. మల్లన్న జాతరకు పదివేల మంది భక్తులు వచ్చారని తమ దృష్టికి వచ్చిందని, కుమ్మెర ఘటనను రాష్ట్ర బీసీ కమిషన్ అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని విచారణ చేయాల్సిందిగా కలెక్టర్, ఎస్పీ, దేవా దాయ శాఖను ఆదేశించారు. బీసీ కమిషన్ నివేదిక అందిన వెంటనే చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల రక్షణ కమిషన్ బాధ్యత అని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకొని నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.
బాధిత కుటుంబానికి బీసీ కమిషన్ అన్ని విధాలా అండగా నిలుస్తుందని, పోలీసులు పారదర్శక దర్యాప్తు చేసి నిజానిజాలను వెలికితీయాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. సమాజంలో సమానత్వ భావనను పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని కమిషన్ చైర్మన్ పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా జిల్లా యంత్రాంగం చర్యలను బీసీ కమిషన్ దృష్టికి కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌లు వివరించారు. అనంతరం కలెక్టరేట్లో బాధిత కుటుంబ సభ్యులతో బీసీ కమిషన్ సభ్యులు జరిగినకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.