Pregnancy | గర్భధారణ అంటే ప్రతి మహిళ జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో శరీరంలోనే కాకుండా ఆలోచనలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. తల్లి తీసుకునే ప్రతి ఆహారం ఆమె ఆరోగ్యంతోపాటు గర్భంలో పెరుగుతున్న శిశువు ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణులు పోషకాహారం తీసుకోవడంతోపాటు, కొన్ని ఆహార పదార్థాలను పూర్తిగా దూరంగా ఉంచాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆహారాల గురించి వారు వివరిస్తున్నారు. గర్భిణులు అధికంగా మెర్క్యురీ (పాదరసం) ఉండే చేపలను తినకూడదు. మెర్క్యురీ శరీరానికి విషపూరితమైన లోహం. ఇది గర్భంలోని శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. షార్క్, ట్యూనా, కింగ్ మాకెరెల్, స్వోర్డ్ ఫిష్ వంటి చేపల్లో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని గర్భధారణ సమయంలో వీలైనంత వరకు నివారించడం మంచిది. అలాగే పచ్చి చేపలతో తయారు చేసే సుషీ వంటి ఆహారాలను కూడా తీసుకోకూడదు. అయితే మెర్క్యురీ తక్కువగా ఉండే చేపలు ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం కావడంతో వైద్యుల సూచన మేరకు మితంగా తీసుకోవచ్చు.
కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, కొన్ని రకాల శీతల పానీయాల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. గర్భిణులు కెఫీన్‌ను అధిక మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. కెఫీన్ సులభంగా ప్లాసెంటా ద్వారా గర్భంలోని శిశువుకు చేరుతుంది. దీంతో శిశువు ఎదుగుదలపై ప్రభావం పడటంతోపాటు పుట్టినప్పుడు తక్కువ బరువుతో జన్మించే ప్రమాదం పెరుగుతుంది. మైదాతో తయారయ్యే ప్రాసెస్డ్ జంక్ ఫుడ్, అధికంగా నూనెలో వేయించిన పదార్థాలు, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ పదార్థాలు కలిగిన ఆహారాలను కూడా గర్భిణులు దూరంగా ఉంచాలి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించకపోగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్యాక్ చేసి విక్రయించే పండ్లు, సలాడ్లు కూడా గర్భిణులకు సురక్షితమైనవి కావని నిపుణులు చెబుతున్నారు. వీటిలో నిల్వ కాలాన్ని పెంచేందుకు ఉపయోగించే ప్రిజర్వేటివ్‌లు, ఇతర కృత్రిమ పదార్థాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి గర్భంలోని శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.
పచ్చి గుడ్లు లేదా పూర్తిగా ఉడకని గుడ్లను కూడా గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. వీటిలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. దీని వల్ల కడుపునొప్పి, వికారం, వాంతులు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అరుదుగా ఈ ఇన్ఫెక్షన్ గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి నెలలు నిండక ముందే ప్రసవం లేదా గర్భస్రావానికి దారితీస్తుంది. పచ్చి గుడ్లతో తయారయ్యే మయోనైస్, కొన్ని సలాడ్ డ్రెస్సింగ్స్, కేక్ ఐసింగ్, సగం ఉడికించిన గుడ్లు వంటి ఆహారాలను కూడా నివారించడం మంచిది. మొలకెత్తిన గింజలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, వాటిని పచ్చిగా తినడం గర్భిణులకు మంచిది కాదు. పచ్చి మొలకల్లో కూడా సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. అయితే బాగా ఉడికించిన తర్వాత వాటిని తీసుకోవడం సురక్షితంగా చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. మద్యం గర్భస్రావం ప్రమాదాన్ని పెంచడమే కాకుండా గర్భంలోని శిశువు మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భధారణ కాలంలో మద్యం ఎంత తక్కువ మోతాదులోనైనా సరే తీసుకోకుండా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.