మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రానున్నారు. మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకులు కుల వివక్ష చూపుతూ చాకలి చంద్రకళ కుటుంబంపై అమానుషంగా దాడికి దిగారు. ఈ ఘటనలో రెండు నెలల పాప తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే ఉల్టా దాడికి గురైన బాధిత కుటుంబంపైనే కేసు నమోదు చేయడంతో వారంతా భయపడి గ్రామం వదిలి నాగర్‌కర్నూల్‌లో తలదాచుకుంటున్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరగకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఇతర పార్టీ నేతలు వస్తున్నారని మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా వారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకుంటారు. ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11:30 వరకు కేటీఆర్ నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు అని తెలిపారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం పార్టీ నేతలు అందరూ తరలివచ్చి బాధిత కుటుంబానికి అండగా ఉండాలని న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కేటీఆర్ రాకతో కుమ్మెరలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కూడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కేటీఆర్ వస్తున్నాడని తెలుసుకున్న ఎస్పీ హడావుడిగా రాత్రి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా కు వెల్లడించారు. ఇన్నాళ్లు మీడియాకు దూరం గా ఉన్న పోలీసులు కేటీఆర్ వస్తున్నాడని తెలిసి హడావుడిగా వివరాలు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.